బాసరలో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగొట్టారు. ఓ కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నారు. కేవలం నగలు.. నగదు కోసం ముగ్గురిని బలితీసుకున్నారు.
బాసరలో దొంగల బీభత్సం.. ముగ్గురి మృతి..
Published Sun, Aug 18 2013 4:08 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
భైంసా/ముథోల్/బాసర, న్యూస్‌లైన్ : బాసరలో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగొట్టారు. ఓ కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నారు. కేవలం నగలు.. నగదు కోసం ముగ్గురిని బలితీసుకున్నారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబ యజమాని, అతని భార్య, పెద్ద కొడుకు దుండగుల దాడికి విగతజీవులయ్యారు. చిన్న కొడుకు తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు.
వలస వచ్చి...
హైదరాబాద్‌కు చెందిన సాలిక అశోక్ (50) 35 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా వలసవచ్చారు. అతనికి భార్య సువర్ణ (45), ఇద్దరు కొడుకులు మణికంఠ (25), శరత్‌చంద్ర (11), ఇద్దరు కూతుళ్లు. ఆరేళ్ల ఓ కూతురు అనారోగ్యంతో చనిపోగా.. ఐదేళ్ల క్రితం మరో కూతురు వివాహం జరిపించాడు. బాసరలోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. పెద్ద కొడుకు మణికంఠ చదువు పూర్తిచేసి తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. చిన్న కొడుకు ఆరో తరగతి చదువుతున్నాడు.
గతంలో నష్టపోయి...
సాలిక అశోక్ గతంలో వ్యాపారంలో నష్టపోయాడు. వ్యాపారం చేస్తూ ఓ లాడ్జి కొనుగోలు చేశాడు. అప్పులు తీర్చలేక మళ్లీ దాన్ని అమ్మేశాడు. అనంతరం ఆరేళ్లుగా ఆలయ ప్రాంగణంలో బారీకేడ్ల వద్ద పూలదుకాణం పక్కనే కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఆట వస్తువులు విక్రయించే దుకాణాన్ని వేలం పాట ద్వారా దక్కించుకున్నాడు. దుకాణాన్ని నడుపుతూ శారదనగర్‌లో ఇంటిని నిర్మించాడు. ఇంటి పనులు పూర్తయితే పెద్ద కొడుకు మణికంఠ వివాహం చేయాలని ఇంట్లో చర్చించుకుంటున్నారు.
దోపిడీ హత్యలే...
శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే ఇంటికి చేరుకున్న అశోక్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించాడు. అర్ధరాత్రి సమయంలో దుండగులు ఇంటి వెనకాల కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి చొరబడ్డారు. ప్రధాన ద్వారం వద్ద హాలులో నిద్రిస్తున్న కుటుంబీకులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కత్తులతో ఇష్టారాజ్యంగా దాడిచేసి ముఖాలను గుర్తుపట్టలేని విధంగా చేశారు. దుండగుల దాడితో సాలిక అశోక్, ఆయన భార్య సువర్ణ, పెద్ద కొడుకు మణికంఠ అక్కడికక్కడే చనిపోయారు. చిన్న కొడుకు శరత్‌చంద్ర తీవ్రగాయాలతో రాత్రంతా అక్కడే పడిఉన్నాడు. అందరూ చనిపోయారనుకుని దుండగులు బయటపడ్డారు. వ్యాపారి ఇంట్లోని నగదు, నగలు, సెల్‌ఫోన్‌లు, ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న కారును తీసుకెళ్లిపోయారు.
ఇలా వెలుగులోకి..
వ్యాపారి ఇంట్లో ఒకటో అంతస్తులో కార్పెంటర్లు ఇంటి అలంకరణ చేస్తున్నారు. శుక్రవారం పనులు చేశాక పైఅంతస్తులోనే నిద్రించారు. శనివారం ఉదయం నిద్రలేచి బయటకు వెళ్లారు. హోటల్‌లో అల్పాహారం చేశాక మళ్లీ పనులు చేసేందుకు వెనక్కి వచ్చారు. ప్రతి రోజూ అశోక్ నిద్రలేవగానే.. ఆరోజు చేపట్టే పనులపై వాకబు చేసేవారు. తెల్లవారినా ఆయన రాకపోవడంతో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వారు కిందికి వచ్చి కిటికీ నుంచి లోపలికి చూశారు. అప్పటికే రక్తపు మడుగుల్లో వ్యాపారి కుటుంబీకులను చూసి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. అప్పటికే విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే.. శరత్‌చంద్ర చేతి కదపడంతో అతను బతికే ఉన్నాడనుకుని ఆస్పత్రికి తరలించాలని స్థానికులు పోలీసులకు చెప్పారు. డీఎస్పీ వచ్చాకే తలుపులు తెరుస్తామని, అప్పటి వరకు లోనికి ఎవరూ వెళ్లొద్దని ముథోల్ సీఐ శ్రీధర్‌రావు స్థానికులకు స్పష్టం చేశారు. పిల్లాడిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లకుంటే ప్రాణాలు దక్కవని గ్రామస్తులు కోరడంతో సీఐ శ్రీధర్‌రావు అంబులెన్సును పిలిపించారు. 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడి వైద్యుల సూచన మేరకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శరత్‌చంద్ర కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిజామాబాద్ ఆసుపత్రికి తరలించే ముందు వ్యాపారి చిన్న కొడుకు శరత్‌చంద్ర దుండగులు మరాఠీలో మాట్లాడారని వెల్లడించారు. బండరాళ్లు, కత్తులతో కొట్టి చంపారని.. అంతా దోచుకువెళ్లారని తెలిపారు.
జాగిలాలతో తనిఖీ...
భైంసా డీఎస్పీ దేవిదాస్‌నాగుల సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసు జాగిలాలను రప్పించారు. మధ్యాహ్నం 1.27 గంటలకు జాగిలాలు ఇంటిలోకి పంపించారు. శారదనగర్ సమీపంలోని కల్యాణ మండపం, పెట్రోల్ బంక్, రైల్వే స్టేషన్ వరకు వెళ్లి జాగిలాలు ఆగిపోయాయి. జాగిలాలు పరుగెత్తిన మార్గాన్ని బట్టి చూస్తే దుండగులు మహారాష్ట్రకు చెందిన వారే అయి ఉంటారని రైలు మార్గం ద్వారా బాసర వచ్చి పెట్రోల్ బంక్ సమీప రోడ్డు నుంచి కల్యాణ మండపం దాటి ఇంట్లోకి చొరబడ్డారా అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement