నామినేషన్ వేసేముందు.. ఒక్కక్షణం
కామారెడ్డిటౌన్, న్యూస్‌లైన్ :
బల్దియా పోరులో మరో అంకానికి తెరలేసిం ది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఆశావహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
నామినేషన్ల సమయంలో ప్రజలు అధికంగా గుమికూడడాన్ని నిరోధించడానికి, తగిన నియంత్ర ణ ఉండడానికి ఎన్నికల కమిషన్ 2011 జూలై 01న జీఓ నెంబర్ 528/ఎస్‌ఈసీ-ఎఫ్1/2011-5 ను జారీ చేసింది. దాని ప్రకారం..
ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి లోపలకు గరిష్టంగా రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
నామినేషన్‌ల సమయంలో ఎన్నికల అధికారి, సహాయ అధికారి కార్యాలయంలోనికి అభ్యర్థితోపాటు నామినేషన్ ప్రతిపాదించేందుకు గరిష్టంగా మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు.
చట్ట ప్రకారం నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా గాని, లేక అతని ప్రతిపాదకుడు గాని ఎన్నికల అధికారి లేదా సహాయ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో ఎన్నికల అధికారి కార్యాలయంలోనికి ప్రతిపాదకుడితోపాటు మరో ఇద్దరిని అనుమతిస్తారు.
నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థి వెంట ఉండే వాహనాల వ్యయాన్ని అభ్యర్థి ఎన్నికల వ్యయంలో లెక్కిస్తారు.
నామినేషన్‌లో అందించిన వివరాలు సక్రమంగా లేకపోయినా తిరస్కరించే అధికారం అధికారులకు ఉంటుంది.
ఇతర అంశాలు..
బల్దియాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఆ బల్దియాలో ఏ వార్డునుంచైనా పోటీ చేయవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే నామినేషన్ పత్రాన్ని ఉచితంగా అందిస్తారు.
ఒక అభ్యర్థి తరపున ఒక వార్డుకు నాలుగింటికి మించకుండా నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు.
{పతి నామినేషన్ పత్రంపై అభ్యర్థి, లేక ప్రతిపాదకుడి సంతకం తప్పనిసరి. పోటీకి సంసిద్ధతను తెలియజేస్తూ డిక్లరేషన్‌పై అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టరైన రాజకీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పార్టీ పేరును నామినేషన్ పత్రంలో సూచించాల్సి ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు బీఫామ్ సమర్పించాల్సి ఉంటుంది.
మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 నామినేషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500, ఇతరులు రూ. 5 వేలు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రెవెన్యూ శాఖ డిప్యూటీ తహశీల్దార్ హోదాకు తక్కువ గాని అధికారి నుంచి డిక్లరేషన్ పత్రాన్ని నామినేషన్‌కు జతచేయాల్సి ఉంటుంది.