బండిఆత్మకూరులో బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. బాలిక ....
పదమూడేళ్ల బాలికకు
వివాహం చేసే యత్నం
చివరి నిమిషంలో అడ్డుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, పోలీసులు
బండిఆత్మకూరు: బండిఆత్మకూరులో బాలికకు వివాహం చేసే ప్రయత్నాన్ని పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రులను కౌన్సెలింగ్ ఇచ్చి సర్ధి చెప్పారు. బండిఆత్మకూరు గ్రామానికి చెందిన వనార్చి కృష్ణ (26)కు అదే గ్రామానికి చెందిన బాలమ్మ కూతురు లక్ష్మితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి హేమ (3)అనే కూతురు ఉంది. బతుకుదెరువుకు వనార్చి కృష్ణ, లక్ష్మి ముంబై వెళ్లారు. కుటుంబ కలహాలతో ఆరు నెలల క్రితం లక్ష్మి అక్కడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వనార్చి కృష్ణ మళ్లీ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
గిద్దలూరుకు చెందిన ఒక బాలికను(13)ను పెళ్లి చేసుకోనున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు బుధవారం ఉదయం బండిఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని వనార్చి కృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను విచారించారు. తర్వాత వనార్చి కృష్ణ, బాలిక, ఆమె తలిదండ్రులను పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి విచారించారు. తమ కూతురు గిద్దలూరులోని ఒక పాఠశాలలో ప్రస్తుతం నాలుగోతరగతి చదువుతుందని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
తాము తమ కూతురుకు పెళ్లి చేసేందుకు ఇక్కడకు రాలేదన్నారు. మహాశివరాత్రికి తమ బంధువైన వనార్చి కృష్ణ ఇంటికి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శిరీషతో పాటు సిబ్బంది ఆనందమ్మ, నాగరజామ్మ సుశీలమ్మ, రాజమ్మ, సునీత, రామేశ్వరమ్మ వచ్చి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు.బాలికకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయవద్దని వారికి వివరించారు. అనంతరం వారితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేసిన కఠినంగా శిక్షిస్తామని ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి వారిని హెచ్చరించారు.