
తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం కల్పవృక్షం, రాత్రి కొత్త సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు తిరు వీధుల్లో విహరించారు. నాలుగో రోజు భక్తుల సందడి పెరిగింది. గ్యాలరీలు నిండుగా కనిపించా యి. సాయంత్రం శ్రీవిల్లిపుత్తూరు నుంచి పుష్పమాలలు, చెన్నయ్ నుంచి గొడుగులు కానుకగా అందాయి. సహస్ర దీపాలంకార సేవలో స్వామి వేయి నేతి దీపాల వెలుగులో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృందాల విభిన్న ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. అఘోరా నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. చర్నాకోల్ చేతబట్టి రాజమన్నార్ రూపధారిగా భక్తులను కటాక్షించారు. వాహన సేవకు ముందుకళా బృందాల ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. మధ్యాహ్నం ఆలయంలో స్నపన తిరుమంజనం కనులపండువగా జరిగింది.రాత్రి ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి తిరువీధుల్లో విహరించారు.
అదనపు బందోబస్తు
తిరుపతి (అలిపిరి) : గరుడోత్సవానికి అదనంగా 1000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ జె.ప్రభాకర్ రావు వెల్లడించారు. తిరుమల రాంభగీచ విశ్రాంతి గృహాల సముదాయం ఎదుట ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్ రూంలో మంగళవారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతితో కలిసి గరుడసేవ భద్రతపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గరుడ సేవ రోజున తిరుమలలో ఎటువంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్, క్రైమ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు సేవలందించాలని కోరారు. గరుడ సేవ రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తితే ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనాలను తిరిగి తిరుపతికి వెనక్కు పంపుతామని తెలిపారు.
♦ విస్తృత తనిఖీలు
తిరుపతి అర్బన్: శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన గరుడసేవను పురస్కరించుకుని మంగళవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు పటిష్ట తనిఖీలు చేపడుతున్నట్టు అలిపిరి ఏవీఎస్‌ఓ దాసరిదండు గంగరాజు తెలిపారు. డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లతో పాటు భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమలకు పంపుతున్నామన్నారు. కాలిబాట మెట్ల మార్గాలు, అలిపిరి పాత చెక్‌పాయింట్ పరిసరాల్లో విస్తృత తనిఖీ లు చేస్తునట్లు తెలిపారు. అనామానాస్పద వ్యక్తలు, గుర్తు తెలియని లగేజీలు కనిపిస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు, నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతామని తెలిపారు.
♦ నేడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ
♦ 3.70 లక్షల మందికి ప్రసాదాలు సిద్ధం
తిరుపతి (అలిపిరి): గరుడ సేవకు విచ్చేసే భక్తకోటికి నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు టీటీడీ అన్నదాన డిప్యూటీ ఈఓ వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం 8 నుంచి రాత్రి ఒంటి గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. 3.70 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీల్లోని భక్తులకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బిస్బెల్లా బాత్, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, ఉప్మా, కాఫీ, పాలు అందిస్తామని తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్, సీఆర్‌ఓ, రాంభగీచా విశ్రాంతి గృహాల వద్ద ఉన్న ఫుడ్ కౌంటర్ల ద్వారా రోజుకు 40 వేల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాల్లో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 1985లో రోజుకు 2వేల మందితో అన్నప్రసాద వితరణ ప్రారంభించి నేడు 1.5 లక్షల మందికి అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో టీటీడీ క్యాటరింగ్ అధికారి శాస్త్రి, పీఆర్వో రవి, ఏపీఆర్వో నీలిమ పాల్గొన్నారు.
నేటి గరుడోత్సవానికి నిమిషానికి 4 బస్సులు
♦ 24గంటలు ఘాట్ రోడ్లలో రాకపోకలు
♦ టూవీలర్లకు నో ఏంట్రీ
తిరుపతి సిటీ: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరిగే గరుడ సేవను పురస్కరిం చుకుని∙నిమిషానికి 4 బస్సులను నడిపేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. గరుడ సేవకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారు జామున నుంచే కావాల్సినన్ని బస్సులను సిద్ధం చేశారు. గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల ఘాట్ రోడ్లలో 24 గంటల పాటు బస్సులు రాకపోకలు కొనసాగించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉదయం నుంచి గురువారం తెల్లవారు జాము వరకు 525 బస్సులతో 4152 ట్రిప్పులు నడిపేలా ఆర్‌ఎం నిర్ణయించారు.
గరుడ సేవను పురస్కరించుకుని మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ద్విచక్ర వాహనాలను తిరుమలకు రద్దు చేశారు. తిరుమలకు వెళ్లే ద్విచక్ర వాహనదారులు అలిపిరి, బాలాజీ లింక్ బస్ స్టేషన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో పెట్టాలి. అక్కడ్నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది.