రాజంపేట: వైఎస్‌ఆర్ జిల్లాలో చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం దత్తత తీసుకోవడం కలగానే మిగులుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఒక పెద్ద చారిత్రాత్మక దేవాలయంగా తెరపైకి వచ్చింది. అయితే కేంద్రపురావస్తుశాఖ అధీనంలో ఉండడంతో ఆలయ నిర్వహణ విషయంలో దేవదాయధర్మాదాయశాఖ కానీ, తిరుమల తిరుపతి దేవస్ధానం కాని పట్టించుకోవడంలేదు.
ఇంతవరకు ట్రస్ట్‌బోర్డుకు నోచుకోలేదు. కేవలం సింగల్‌ట్రస్ట్‌తో నడుస్తోంది. ఆలయ గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టును చూసిన భక్తులు అచ్చం ఏడుకొండలస్వామినే దర్శించుకున్నంత భాగ్యం కలుగుతోందని అనుభూతి చెందుతున్నారంటే ఈ ఆలయానికి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థం అవుతుంది.
సౌమ్యనాథాలయ చరిత్రలోకి..
సౌమ్యనాథాలయం అపురూప చోళ శిల్ప కళాసంపత్తికి ఆలవాలమై చెయ్యేరు(బహుదా) నదీతీరాన నందలూరు గ్రామంలో నిర్మితమై ఉంది. జిల్లా కేంద్రం కడపకు 45కిలోమీటర్ల దూరంలో, రాజంపేటకు 10కిలోమీటర్ల దూరంలో ఉంది. 10ఎకరాల విస్తీర్ణంలో..108 స్తంభాలతో నిర్మించిన సువిశాలమైన ఆలయం. కులోత్తుంగచోళుడు (చోళరాజు)11శతాబ్ధం పూర్వార్ధంలో ఆలయాన్ని నిర్మించారు. అన్నమయ్య స్వామిని దర్శించుకొని కీర్తనలు ఆలపించారని చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం వెనుక వెయ్యేళ్ల చరిత్ర ఉంది. స్వామి వారి గర్భగుడిలో ఏ దీపంలేకపోయినా సరే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి దివ్యమంగళరూపం దేదీప్యమానంగా కనపడే విధంగా ఆలయం నిర్మించడం విశేషం. స్వామివారి పాదాలపై స్యూరకిరణాలు పడతాయి.
నారదమునీంద్రునిచే ప్రతిష్ట..
శ్రీసౌమ్యనాథస్వామి ఆలయంలో మూలవిరాట్టును దేవర్షియగు నారదమునీంద్రులు ప్రతిష్టించారు. మూలవిరాట్టు ఆరు అడుగులు ఎత్తుతో సౌమ్యంగా అభియముద్రాలంకితమై దర్శనిమిస్తారు. సౌమ్యనాధున్ని చోళరాజులు చొక్కనాధుడు అని పిలుచుకునేవారు. సౌమ్యనాథుడనగా సౌమ్య(లక్ష్మీదేవి)కు నాథుడని, ప్రశాంతస్వరూపుడని అర్ధాలున్నాయి. తెల్లవారుజామున ఆలయంలో సప్తబుషులు స్వామికి పూజచేస్తారని పూర్వం ఆలయ అర్చకులు చూసిన దాఖలాలు ఉన్నాయని ప్రచారం. ఐదేళ్ల కిందట నుంచి ఆలయం దినాదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. స్వామికి జిల్లా నుంచే కాక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు.
దత్తతకు సిద్ధమై ఆపై....
టీటీడీ పాలకమండలి దేవుని కడపతోపాటు నందలూరు సౌమ్యనాథాలయాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధమైనా రూ.30లక్షల వ్యయంతో రథం మాత్రం చేయించి సరిపెట్టింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సైతం టీటీడీ దత్తతు తీసుకునేందుకు సమ్మితించారు. ఆయన మరణం తర్వాత ఈ విషయం ఎవరూ పట్టించుకోవడంలేదు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సొంతమండలంలో ఉన్న ఘనచరిత్ర కలిగిన సౌమ్యనాథాలయం టీటీడీలోకి విలీనం చేయడంపై ఆయన దృష్టిపెట్టాలని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీ మిథునరెడ్డి కూడా ఈ ఆలయానికి కేంద్రపురావస్తుశాఖ నుంచి విముక్తి కల్పించి, టీటీడీలోకి విలీనం చేసేలా కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు.
సౌమ్యనాథా... దత్తతేదీ!
Published Sat, Feb 28 2015 1:29 AM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
Advertisement
Advertisement