సాక్షి ప్రతినిధి, కడప: జెడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్మన్ వరకు.. ఎంపీపీ నుంచి ఎమ్మెల్యే వరకూ, కార్యకర్త నుంచి ఆయా పార్టీల జిల్లా అధ్యక్షుల వరకు.. తుదకు ప్రజాసంఘాలు సైతం ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చి.. విజ్ఞత ఉన్న కలెక్టర్‌ను నియమించండని నినదించారు. ఈ కలెక్టర్‌ను వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చ అంతా కలెక్టర్ వ్యవహార శైలిపైనే సాగింది. సమావేశానికి కలెక్టర్ కెవీ రమణ హాజరు కాలేదు.
ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ రామారావు హాజరయ్యారు. ‘జిల్లాలో 48 మండలాలను కరువు మండలాలుగా గుర్తించారు.. సుమారు 500 గ్రామాలల్లో తాగునీటి ఎద్దడి తీవ్ర ఉంది.. కూలీలకు ఉపాధి లేక వలసబాట పట్టారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకంటే ముఖ్యమైన సమస్య ఏముంది.. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరు కాలేదంటే ప్రజాప్రతినిధులను అవమాన పరచడమే’ అనిఎమ్మెల్యేలు సి ఆదినారాయణరెడ్డి, పి రవీంద్రనాథరెడ్డి, జి శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, టి జయరాములు, ఎస్‌బి అంజాద్‌బాషలు అభిప్రాయపడ్డారు. జిల్లాకు పారిశ్రామికవేత్తలు రావాలంటే ఇక్కడి ప్రజలు ఆవేశపరులని భయపడుతున్నారని కలెక్టర్ ప్రకటించడం క్షమార్హం కాదన్నారు.
ప్రజల్ని అవమానపర్చిన కలెక్టర్‌పై చర్చించాలని, ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఆప్, వైఎస్సార్‌సీపీ, బిజెపి, మానవ హక్కుల వేదిక, రాయలసీమ కార్మిక కర్షక సమితి, రైతు సంఘాల ప్రతినిధులు అఖిలపక్షంగా ఏర్పడి జడ్పీ చైర్మన్ గూడూరు రవి, శాసనమండలి డిప్యూటి చైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి, టీడీపీ విప్ మల్లికార్జునరెడ్డిలకు వినతిపత్రాలిచ్చారు. అనంతరం జెడ్పీ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లి ధర్నా చేపట్టారు.
కలెక్టర్ డౌన్‌డౌన్.. ప్రజాద్రోహి కలెక్టర్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ను వెనక్కు పిలిపించండి.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి జిల్లాకు విధుల నిమిత్తం వచ్చిన కలెక్టర్లు బదిలీపై వెళ్తూ జిల్లా ప్రజల్ని ప్రశంసించిన చరిత్ర ఉంద న్నారు.
ప్రజల పట్ల బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న కలెక్టర్‌ను మొదటిసారి చూస్తున్నామని తెలిపారు. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్న కలెక్టర్‌ను నియమించాలని నేతలందరూ ముక్తకంఠంతో కోరారు. జిల్లా కలెక్టర్‌ను తక్షణం వెనక్కి పిలిపించి ఉన్నత వ్యక్తిత్వం కల్గిన ఐఏఎస్ అధికారిని నియమించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహమ్మద్, మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నారాయణ, సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, ఈశ్వరయ్య, రైతు సంఘాల నాయకులు చంద్రమౌళీశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆప్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, బిసీ సంఘాల నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కలెక్టర్ మాకొద్దు
Published Wed, Apr 1 2015 2:13 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement