ఇదో చారిత్రాత్మక రోజు | This is a historic day | Sakshi
Sakshi News home page

ఇదో చారిత్రాత్మక రోజు

Published Wed, Feb 18 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

This is a historic day

అద్దంకి :  అద్దంకి ఆర్టీసీ చరిత్రలో ఇదో చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ నాయకుడు వాకా రమేష్ అన్నారు. డిపోలో వోటీ విధానానికి నిరసనగా మంగళవారం కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. ఓటీలను ఎత్తివేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మూడు రోజుల పాటు నిరసన ధర్నాలు, ఆరు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. యాజమాన్యం స్పందించి చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తుందని ఎదురు చూసినా ఫలితం దక్కలేదు.
 
 డీఎం మధుసూదన్‌తో చర్చలు జరిపినా ఫలితంలేకపోవడంతో మంగళవారం కార్మికులందరూ విధులకు వెళ్లకుండా డిపో వద్ద టెంట్లు వేసుకుని కూర్చున్నారు. పట్టణంలో యాజమాన్యానికి నిరసనగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఈయూ రీజనల్ నాయకుడు రమేష్ మాట్లాడుతూ యాజమాన్యానికి అర్థం కావాలని, ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయకూడదని రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపినా డీఎం సమస్యను పెడచెవిన పెట్టారన్నారు. కార్మికుల సహనాన్ని పరీక్షించడంతోనే ఇంత దాకా వచ్చిందని పేర్కొన్నారు. 89 షెడ్యూల్స్ ఉన్న చోట 23 వోటీలను వేయడం ఏమిటని ప్రశ్నించారు.
 
 ఇలాంటి పరిస్థితి జిల్లాలోనే ఎక్కడా లేదన్నారు. పోనీ వోటీలు వేసే రహదార్లేమైనా బాగున్నాయంటే అవి డొంక రోడ్లని పేర్కొన్నారు. ఆ రహదార్లలో వోటీలు చేయడం వల్ల డ్రైవర్లు అనారోగ్యానికి గురైతే తార్నాక వైద్యశాలకు పంపడం కూడా చేయడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వోటీలను అసలు చేయమని స్పష్టం చేశారు. యాజమాన్యం  స్పందించి వోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎంయూ నాయకులు టీకే రావు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సీపీఎస్ రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు పి.తిరుపతిరెడ్డి, అల్లం సుబ్బయ్య, కొండలు, ఎంకే రావు, పీటీ రెడ్డి, శ్రీనివాసరావు, వివిధ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement