కడప అర్బన్, న్యూస్‌లైన్: ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు వచ్చే ఏడాదిలో పూర్తిగా పరిష్కరించేందుకు తమవంతు కృషి చేస్తామని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. మంగళవారం సాయంత్రం తమ యూనియన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక వేతన సవరణ సాధనలో తాము వెనకబడ్డామని నేషనల్ మజ్దూరు యూనియన్ నేతలు విమర్శించడం సరికాదన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 17వేల మంది కాంట్రాక్టు కార్మికులను 2013 జులై 4న తమ యూనియన్‌తో యాజమాన్యం చేసుకున్న ఒప్పందం ప్రకారం మూడు విడతలుగా రెగ్యులరైజ్ చేస్తారని తెలిపారు. అలాగే 24వేల మంది కండక్టర్లు, డ్రైవర్లను రెగ్యులరైజ్ చేయించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలులో భాగంగా చనిపోయిన కార్మికుల పిల్లలకు గడువు లేకుండా ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రయత్నిస్తామన్నా రు. వేతన సవరణ మేరకు ఉద్యోగులకు వేతనాలు ఇప్పిం చేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.