ఇది రాజకీయ కుట్ర : ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా
వడమాలపేట: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం అధికారపార్టీ రాజకీయ కుట్ర అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా విమర్శించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసి గురువారం అర్ధరాత్రి వడమాలపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆయనను పుత్తూరు కోర్టుకు తరలించారు. అంతకు ముందు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా వడమాల పేట స్టేషన్‌లో చెవిరెడ్డిని పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజాసమస్యలపై పోరాడే చెవిరెడ్డిని అణచివేయాలనే కుట్రతో తప్పడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అర్ధరాత్రి లాక్కొచ్చి స్టేషన్‌లో వేయడం ప్రజాస్వామ్యమా అని విమర్శించారు. చెవిరెడ్డిని పరామర్శించిన వారిలో ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సురేష్‌రాజు, పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.