ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రలో జరుగుతున్నది ప్రజా ఉద్యమమని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చిత్తశుద్ధితో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేస్తే అసెంబ్లీతోపాటు పార్లమెంటుకు కూడా తాళాలు పడతాయని, అప్పుడు కేంద్రం దిగివస్తుందన్నారు. ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ క్రీడా మైదానంలో గురువారం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ప్రొద్దుటూరు పొలికేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి.. దీనినే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. సర్వేపల్లి ఆంధ్రమహాసభ అధ్యక్షులుగా కూడా పనిచేశారు.. 1920లో తెలుగు మాట్లాడే ప్రజలు ఒక్కటిగా ఉండాలని మహాత్మాగాంధీ సర్వేపల్లికి లేఖ రాశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఒకే గొడుగు కిందికి తేవాలని కోరారన్నారు.
అసలైన గాంధీ తెలుగు ప్రజలందరూ ఒక్కటిగా ఉండాలని కోరుకోగా నేటి నకిలీ గాంధీ రాష్ట్రాన్ని విడదీయాలని కుట్రపన్నుతోందని సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారని, ఈ తీవ్రతను చూస్తుంటే రాష్ట్ర విభజన జరగదనే విశ్వాసం తనలో కలుగుతోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడ ంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు రాజకీయ పక్షాలన్నీ విఫలమయ్యాయన్నారు. మరో మాటలో చెప్పాలంటే వీరు సమైక్యాంధ్రకు వెన్నుపోటు పొడిచారన్నారు.
మహారాష్ట్రలోని విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అక్కడి వారు 15 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారన్నారు. దక్షిణ తమిళనాడులో, గుజరాత్‌లో కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీలో మాయావతి తీర్మానం కూడా చేశారన్నారు. ఇన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్రం ఐక్యంగా ఉన్న తెలుగుప్రజలను విడదీసేందుకు కుట్రపన్నిందన్నారు. తెలంగాణ ప్రజలు సైతం ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, తాను స్వయంగా ఈ విషయాన్ని గ్రహించానన్నారు. 1969లో, 1972లో రాష్ట్ర విభజనకు సంబంధించి సంఘర్షణ జరిగిందని తెలిపారు. అయితే రెండు మార్లు సమైక్యవాదమే గెలిచిందన్నారు. సీమాంధ్ర నేతలు రాజీనామా పత్రాలను స్పీకర్ ఫార్మాట్‌లో పంపకుండా రాజీ డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతుంటే తెలంగాణ వారు నానా దుర్భాషలాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిని సైతం ఇడ్లీ బండి పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని అన్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటైన విషయం మరొకటి ఉందా అని ప్రశ్నించారు.తాను రాష్ట్రంలో 5వేల కిలోమీటర్లు పర్యటించానన్నారు. తెలంగాణ ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని, వాస్తవానికి తెలంగాణ సమాజం అంటూ లేదని తెలిపారు. కొంతమంది స్వార్థపరులు మాత్రమే తెలంగాణవాదం అంటున్నారన్నారు.
ప్రధమ ముద్దాయిలు రాజకీయ నేతలే
ఆర్టీపీపీ (ఎర్రగుంట్ల),న్యూస్‌లైన్‌ః రాష్ట్ర విభజన జరిగితే ప్రధమ ముద్దాయిలుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు మిగిలిపోతారని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ తెలిపారు. గురువారం సాయంత్రం ఆర్టీపీపీలో సమైక్యాంధ్ర సాధన కోసం చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షాపరులను విరమింప చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు జాతిని విభజించడానికి సోనియా ఎవరన్నారు.
మనం నమ్మిన ప్రజాప్రతినిధులు ద్రోహం చేయడంతోనే రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రం విడిపోతే రైతాంగం పంట కాలువలను నీటితో కాక కన్నీళ్లతో నింపుకోవాల్సి వస్తుందన్నారు. అనంతరం ఆర్టీపీపీ జేఏసీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, శంకర్‌రావు తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్‌ఈలు రమణారెడ్డి, శేషారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నాగరాజు, రామసుబ్బారెడ్డి, డీజీఎం నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఇది ప్రజా ఉద్యమం
Published Fri, Sep 6 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement