పీలేరు: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ఖాళీగంప సీఎం చేతికిచ్చి చేతులు దులుపుకున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం కేవీ పల్లె మండలం మహల్‌రాచపల్లెలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి పార్టీ అయినప్పటికీ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం తరచూ ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, సింగపూర్, జపాన్ అంటూ చక్కర్లు కొడుతున్నారు తప్ప సాధించింది శూన్యమన్నారు.
రైల్యే బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినా కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎంకు లేదన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయిస్తే ఇక ఆ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందని ప్రశ్నించారు. కేంద్రం పూర్తి స్థాయిలో రాష్ట్రానికి మొండిచేయి చూపించినా బాబు ఏమీ అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండడం ఆయన అసమర్థతకు నిదర్శనమన్నారు.
బడ్జెట్ పేదల మనోబావాలకు విరుద్ధంగా ఉందన్నారు. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధర పెంచి సామాన్యుల నడ్డివిరిచారని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊహల్లో విహరిస్తున్నారని విమర్శించారు. రాష్ర్టంలో ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ జరిగిన దాఖలాలు లేవన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మహిళలకు మోసం చేశారనిఆరోపించారు.
సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఐదు సంతకాలకు దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వంపై ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మాటమీద నిలబడలేని మోసపూరిత వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచిపోతారన్నారు. ఐదేళ్లు రాష్ట్రంలో దుర్దినాలేనని, భవిష్యత్‌లో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ గల్లంతుకావడం తథ్యమని చెప్పారు.
విశాఖను కుదిపేసిన హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడానికి కేంద్రం రూ. 1000 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని, మిగిలిన రూ. 600 కోట్లు రాబట్టడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు జీ. జయరామచంద్రయ్య, రెడ్డిరాజ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎం. వెంకటరమణారెడ్డి, నాయకులు లక్ష్మిరెడ్డి, గంగిరెడ్డి, లిఫ్ట్ కంపెనీ ఎండీ సురేంద్రనాథరెడ్డి, రామకొండారెడ్డి, పెద్దసిద్దయ్య, వెంకటసిద్దులు, చక్రీ, ధర్మా, ద్వారకనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది ముమ్మాటికీ బాబు వైఫల్యమే
Published Mon, Mar 2 2015 1:03 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement