
ఇదే ఆఖరి కోరిక
ఇదే ఆఖరి కోరిక
అమ్మ, భార్య, పిల్లలకు రాసిన సూసైడ్ నోట్‌లో రైతు విన్నపం
అప్పుల బాధతోఆత్మహత్య చేసుకున్న యువ రైతు
అనాథలుగా మారిన కుటుంబ సభ్యులు
అమ్మ, భార్యా, పిల్లలు మణికంఠ (15 నెలలు), చరిత(4), దీక్షిత(7)కు...
క్షమించండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇంత చిన్న వయసులోనే మీ ఆలనాపాలనా చూసుకోకుండా వెళ్లిపోతున్నాను. సమాజంలో అందరిలాగే మిమ్మల్ని కూడా బాగా చదివించాలని ఉంది. కానీ విధి వక్రీకరించింది. అందుకే క్షమించమని కోరుతున్నా. చిన్న వయసులోనే మీరు ఈ కాలాన్ని ఎలా నెట్టుకువస్తారోనని నాకు భయంగా ఉంది. మీరంటే(పిల్లలు) నాకు చాలా ప్రేమ. నేను ఎక్కడ తిరిగినా సాయంత్రమయ్యే సరికి ఇంటికొచ్చాక మిమ్మల్ని(పిల్లలను)చూశాకే మనశ్శాంతిగా ఉండేది. ఉదయం లేవగానే ‘నాన్నా’ అంటే ఉప్పొంగిపోయేవాడ్ని. కానీ అలాంటి మిమ్మల్ని వదలివెళ్లడం చాలా బాధగా ఉంది. మీ కోసం బతకాలని ఉన్నా, పరిస్థితుల ప్రభావంతో బతకలేకపోతున్నా. మీరు ఎలా బతుకుతారో, ఎలా పెద్దవుతారోనని చాలా భయంగా ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటలకు నిద్రిస్తున్న మిమ్మల్ని కడసారి చూసుకున్న నాకు గుంతకల్లు చేరే వరకూ కన్నీళ్లు ఆగలేదు. (ఆత్మహత్యకు ముందు గోపాల్ రాసిన సూసైడ్ నోట్ ఇది) - గుంతకల్లు రూరల్
గుంతకల్లు రూరల్ మండలం నల్లదాసరపల్లిలో నివాసముండే గోపాల్(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆయన సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నారు. తండ్రి మరణంతో స్వగ్రామం వదిలి..విడపనకల్లు మండం పెంచలపాడుకు చెందిన రామాంజనమ్మ, మల్లేశ్ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గోపాల్. పదిహేనేళ్ల కిందట తండ్రి అనారోగ్యంతో మరణించగా, తల్లితో కలసి ఆమె పుట్టినిల్లైన గుంతకల్లు రూరల్ మండలం నల్లదాసరపల్లికి చేరుకున్నాడు. పసుపు కుంకుమ కింద తల్లి రామాంజనమ్మకు ఇచ్చిన నాలుగెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. పదేళ్ల కిందట భారతితో గోపాల్ వివాహం జరగ్గా, వారికి ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడు జన్మించారు.
సూసైడ్ నోట్‌లో గోపాల్ ఇంకా ఏం రాశారంటే...
భూమిని నమ్ముకొని నాలుగేళ్ల కిందట బోరు వేశారు. తొలి ఏడాది పంట బాగా వచ్చినా ఆ తరువాతి సంవత్సరం తిరగబడింది. బోరులో నీరు కూడా రాలేదు. ఆ తరువాత రూ.5 లక్షల వరకు అప్పు చేసి వరుసగా మరో ఎనిమిది బోర్లు వేసినా నీళ్లు పడలేదు. వర్షాలు లేవు. కనీసం పెట్టుబడి కూడా చేతికి దక్కలేదు. అలా మూడేళ్లపాటు గడచిపోయింది. పంటల సాగుకు చేసిన అప్పులు కడదామంటే పంట చేతికి అందేది కాదు. అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. అప్పటి వరకు కూడా నేను కూడా సమాజంలో గౌరవంగా బతుకుతున్నవాడ్నే. కానీ దేవుడు చిన్నచూపు చూశాడు. ఇది నా ఖర్మ. అప్పు ఇచ్చిన వారి తప్పులేదు. అప్పు తీసుకోవడం నా తప్పే.
నా పిల్లల్ని ఆదుకోండి
ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో గోపాల్ పలువురు నేతలనుద్దేశించి ఇలా రాశారు. ‘అన్నా.. నా పిల్లల కోసం ఏమీ చేయలేకపోయాను. దయచేసి నా పిల్లల భవిష్యత్తు కోసం సహాయ సహాకారాలు అందిస్తారని ఆశిస్తున్నా’నంటూ గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, వై.వెంకట్రామిరెడ్డి, పెంచలపాడు ఎంపీపీ ప్రతాప్, పెంచలపాడు మాజీ సర్పంచ్ దేవేంద్రప్ప, గుంతకల్లు ఎంపీపీ రామయ్యకు చివరి కోరిక కోరారు.