యువ రైతు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులే కారణం
కన్నీరుమున్నీరైన కుటుంబీకులు
మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలంలో ఘటన
మెదక్ రూరల్ (హవేళిఘణాపూర్) : ఆర్థిక ఇబ్బందులు తాళ లేక ఓ యువరైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం బోగడ భూపతిపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం తండాకు చెందిన లకావత్ రవి (30)కి ఎకరం పది గుంటల వ్యవసాయపొలం ఉంది. గతేడాది రెండు బోర్లు వేయగా.. అవి ఫెయిలయ్యాయయి. పంటసాగు కోసం, బోర్లు వేయడానికి సుమారు రూ.లక్షా 50 వేల వరకు అప్పులు అయ్యాయి. దీంతో బతుకుదెరువు కోసం ఉపాధిని వెత్తుకుంటూ ప్రతి సంవత్సరం చెరుకు నరికేందుకు భార్యాపిల్లలతో ఎక్కడ పనిదొరికితే అక్కడికి వెళ్లేవాడు. ఈసారి మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం బోగడ భూపతిపూర్ గ్రామానికి చెందిన దండి సాయిలుకు చెందిన తోటలో చెరుకును నరికేందుకు కుటుంబంతో వచ్చాడు. కొద్దిరోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువ అవడంతో తరుచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం సైతం గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన రవి రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం అదే గ్రామంలోని దొమ్మాట మల్లారెడ్డి వ్యవసాయ పొలంలోని టేకు చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో మతుడి భార్య ఛమ్మీ, ఎనిమిదేళ్లలోపు ఇద్దరు పిల్లలు సంఘటన స్థలంలో రోదించిన తీరు అక్కడి వారిని కంట తడిపెట్టించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.