అనంతపురం (చెన్నే కొత్తపల్లి) : సాగు కోసం చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడంతో ఓ యువరైతు బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఎర్రజిన్నయ్యగారిపల్లికి చెందిన అరుణ్ కుమార్(22) అనే యువ రైతు ఐదు ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. రూ. 7లక్షలు అప్పు చేసి పొలంలో బోర్లు వేయించాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడం, బోర్లలో నీళ్లు ఇంకిపోవడంతో అప్పలు తీరే మార్గం లేదని అరుణ్ కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో వారం రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులకు అరుణ్ మృతదేహం పొలంలో కనిపించింది. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.