కారంపూడి: అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుజిల్లా కారంపూడి మండలం చినగార్లపాడుకు చెందిన చల్లా మధు(23) శుక్రవారం బయటకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి రాలేదు. బంధువులు గాలించగా గ్రామానికి సమీపంలోని చింతపల్లి కాల్వ వద్ద శనివారం అతడి మృతదేహం లభ్యమైంది. పక్కనే పురుగుమందు డబ్బా, బీరు సీసా ఉన్నాయి. శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
మధు నాలుగెకరాల్లో పత్తి, ఐదెకరాలలో కంది, రెండెకరాల్లో మిర్చి సాగు చేశాడు. వాగుకు వచ్చిన వరదలో కొంత పంట, భారీ వర్షాలకు మరికొంత పంట ఉరకేసి భారీ నష్టం వాటిల్లింది. ఎకరం మాత్రమే సొంత పొలం కాగా మిగతాది ముందుగా కౌలు చెల్లించి సాగు చేస్తున్నాడు. కౌలుకు, సాగుకు పెట్టుబడుల కోసం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనతో మధు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య
Published Sat, Oct 22 2016 6:37 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement