పత్తి పైరుకు తెగులు సోకడంతో ఇక పంట చేతికి రాదని మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
మల్దకల్ (మహబూబ్‌నగర్) : పత్తి పైరుకు తెగులు సోకడంతో ఇక పంట చేతికి రాదని మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన పరశురాముడు(23) తన రెండెకరాల పొలంలో పత్తి వేశాడు. ఇందుకోసం రూ.లక్షకు పైగా అప్పు చేశాడు.
అయితే ఇటీవల పత్తి మొక్కలకు ఎర్రతెగులు సోకటంతో దిగాలు పడ్డాడు. మొక్కలు ఎర్రబారి పంట చేతికి రాకుంటే చేసిన అప్పులు తీర్చేదెలాగని మదనపడ్డాడు. తీవ్ర ఆందోళనకు గురై బుధవారం రాత్రి పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.