ఇదంతా సహజమే.. : షిండే
రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇలాంటి మనోభావాలు సహజమేనని, ఇలాంటప్పుడు అవతలి వారిని ఓదార్చడం తప్ప మరేమీ చేయలేమని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఏ ఒక్కరూ ఈ మనోభావాలకు అతీతులు కారని ఆయన చెప్పారు. వారందరికీ నచ్చజెప్పేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సలైట్ల సమస్య పెచ్చుమీరుతుందన్న వాదనలను ప్రస్తావించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నక్సలైట్లను అణచి వేయడంలో మంచి రికార్డు ఉందని, రెండు రాష్ట్రాలుగా అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తారన్న విశ్వాసం తనకుందని షిండే తెలిపారు. ప్రస్తుతానికి కేవలం తెలంగాణ గురించే తప్ప, మరో రాష్ట్ర విభజన గురించి ఏమీ ఆలోచించట్లేదని అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయనీ సమాధానం ఇచ్చారు.
తెలంగాణ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.