అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగులో కదలిక లేకుండా పోయింది. ఆరుద్ర కార్తె దాటి పోతున్నా వర్షాల జాడ కనిపించడం లేదు. పంట పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వలేని అన్నదాతలు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. సీజన్ నడుస్తున్నా ప్రభుత్వం నుంచి రుణమాఫీపై గానీ, కొత్తగా పంట రుణాల మంజూరు గురించి గానీ స్పష్టత రాలేదు.
దీనికితోడు సబ్సిడీ విత్తన వేరుశనగ నాణ్యత లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటి వరకు 20 వేల హెక్టార్లలో కూడా పంటలు వేసుకోలేకపోయారు. ఇక 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎప్పుడు సాగవుతాయో అర్థంకాని పరిస్థితి. మరో 15 రోజులు ఇలాగే కొనసాగితే ఖరీఫ్ సాగు పూర్తిగా పడకేసినట్లే. అదే జరిగితే మునుపెన్నడూ లేని విధంగా ‘అనంత’ ైరె తులు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
జూలై 15 వరకు విత్తుకు అదను
వేరుశనగ విత్తుకునేందుకు మంచి అదను జూలై 15వ తేదీతో ముగుస్తుంది. శాస్త్రవేత్తలు మాత్రం జూలై ఆఖరు వరకు వేసుకోవచ్చని చెబుతున్నారు. ఆ తరువాత ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. జూన్ 22న ప్రారంభమైన ఆరుద్ర కార్తె జూలై 5వ తేదీతో ముగుస్తుంది.
ఈ కార్తెలో విత్తనం పడితే మంచి పంటలు పండుతాయని రైతుల నమ్మకం. జూలై 6న ప్రారంభమయ్యే పునర్వసు కార్తె మొదట్లో విత్తనం వేసుకున్నా కొంత వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అంటే జూలై 20 వరకు విత్తుకునేందుకు సమయం ఉన్నట్లుగా భావించవచ్చు. అంతలోగా వేరుశనగ విత్తనం పడకపోతే లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి రావడం గగనమే. వారం.. పది రోజుల్లో వర్షం వస్తే వేరుశనగ విస్తీర్ణం పెరుగుతుంది. అయితే.. ఆ జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ సాధారణ వర్షపాతం 63.9 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. నేటి వరకు 47 మి.మీకే పరిమితమైంది. అరకొర తేమలోనే అక్కడక్కడ కొందరు రైతులు వేరుశనగ విత్తుకున్నారు. తర్వాత వర్షం లేక లేతపైరు ఎండుముఖం పడుతోంది. జూలై సాధారణ వర్షపాతం 67 మి.మీ. అయితే, వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించినా వర్షం పడలేదు. నైరుతి గాలులు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వీయాల్సి వుండగా.. 12-14 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. నాలుగు రోజుల కిందట వరకు ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కాస్త తగ్గినా ఉక్కపోత మాత్రం కొనసాగుతోంది.
ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
వరుస పంట నష్టాలతో కుదేలైన రైతన్నలకు ఈ ఖరీఫ్‌లో పంట పెట్టుబడులు సవాలుగా మారాయి. రుణమాఫీ విషయం తేలితే కానీ బ్యాంకర్లు ఖరీఫ్ రుణ లక్ష్యం మేరకు రూ.2,764 కోట్లు పంపిణీ చేసే పరిస్థితి లేదు.
2013లో నష్టపోయిన వేరుశనగ పంటకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద మంజూరు చేస్తారనుకున్న రూ.643 కోట్ల గురించి ఎవరూ పట్టించుకుంటున్న పాపానపోలేదు. ఇక రూ.90 కోట్ల ప్రీమియం చెల్లించి ఎదురు చూస్తున్న వాతావరణ బీమా పరిహారం అతీగతీ లేదు. దీంతో రైతులు భూములు దుక్కులు చేసుకుని.. విత్తనాలు, ఎరువులు కొనేందుకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
సాగు సాగేనా?
Published Sun, Jun 29 2014 12:38 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement