
కిడ్నీ రాకెట్ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వెంకటేషం, షణ్మఖ పవన్, సూర్యనారాయణలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లిన ఓ యువకుడి నుంచి కిడ్నీ దొంగిలించి, ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టడంతో మొత్తం విషయం బయటపడింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ 26 ఏళ్ల డిగ్రీ చదివిన దినేష్ కుమార్ అనే ఆ యువకుడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నానని గత నెల 22న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మార్చి 30న దినేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు కొలంబో పోలీసులు దినేష్ అన్న గణేష్‌కు ఫోన్ చెప్పారు. వెంటనే వారు భారత హైకమీషన్ అధికారుల సాయంతో దినేష్ మృతదేహాన్ని తెప్పించుకుని అంత్యక్రియలు జరిపించారు.
అయితే విశాఖ వెళ్లిన వాడు కొలంబోకు ఎందుకు వెళ్లాడు అని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానంతో వ్యవహారం మలుపు తిరిగింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి. దినేష్ కేసు విచారణలో సీసీఎస్ పోలీసులకు కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైకి చెందిన ప్రధాన సూత్రధారి ఆధ్వర్యంలో గతంలో కిడ్నీలు అమ్ముకున్నవారే ఒక ముఠా గా ఏర్పడి దీన్ని నడిపిస్తున్నట్లు తేల్చారు.