
పెనువిషాదం
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో శనివారం పెనువిషాదం చోటుచేసుకుంది. గ్రామంలో పాడుపడిన క్వారీ గుంత వద్ద దుస్తులు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడి మృతిచెందారు. తొలుత ముగ్గురు అక్కాచెల్లెళ్లలో అందరికన్నా చిన్నమ్మాయి నీటిలో పడగా, ఆమెను కాపాడడానికి ప్రయత్నించి ఇద్దరు అక్కలూ కూడా ఒకరి తర్వాత ఒకరు నీటిలో పడిపోయారు. కాపాడండంటూ ఆ చిన్నారులు పెడుతున్న ఆర్తనాదాలు విని పరిసరాల్లో ఉన్న వారు అక్కడకు వచ్చి వారిని వెలికితీసేటప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ప్రాంతానికి చెందిన చల్లా శ్రీనివాసరావు, చల్లా జ్యోతి దంపతులు పొట్టకూటి కోసం పదేళ్ల కిందట గుంటూరు శివారు ప్రాంతంలోని తురకపాలెంకు వలస వచ్చారు.
వీరికి శిరీష(11), నీలిమ(8), మల్లీశ్వరి(5) కుమార్తెలున్నారు. శ్రీనివాసరావు చినపలకలూరు క్వారీలోను, తల్లి జ్యోతి రాఘవరావు క్వారీలోనూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే భార్యాభర్తలిద్దరూ ఉదయం పనులకు వెళ్లారు. పిల్లలు ముగ్గురూ తమ దుస్తులు ఉతుక్కుని స్నానం చేసేందుకు పాడుపడిన క్వారీ గుంట వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతికి నీటిలో దిగుదామనుకునే లోపే మల్లీశ్వరి(5) కాలు జారి గుంతలో పడింది. చెల్లిని కాపాడుకునేందుకు ఆమె చెయ్యి పట్టుకునే ప్రయత్నంలో రెండో అమ్మాయి నీలిమ(8) కూడా నీళ్లలో పడిపోయింది. కళ్లముందు నీటిలో పడిపోయిన ఇద్దరు చెల్లెళ్లను ఎలాగైనా కాపాడుకోవాలని పెద్దక్క శిరీష(11) కూడా నీటిలో దిగింది. ఎవరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ కాపాడండని ఆర్తనాదాలు చేశారు. వారి కేకలు విని అక్కడే దుస్తులు ఉతుకుతున్న బత్తుల దుర్గాభవాని చూసి పక్క క్వారీలో పనిచేస్తున్న కార్మికులను పిలుచుకువచ్చింది.
వారు వచ్చి గుంతలో నుంచి చిన్నారులను బయటకు తీశారు. అప్పటికే శిరీష, నీలిమ చనిపోయారు. చిన్నమ్మాయి మల్లీశ్వరి కొన ఊపిరితో ఉండడంతో ఆస్పత్రికి తరలించటానికి రోడ్డుపైకి తీసుకువెళ్లేటప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కూడా ఆవిరైపోయాయి.ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు ఉరుకులు పరుగులపై ఘటనాస్థలానికి చేరుకున్నారు. రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు, తహసిల్దార్ కె.చెన్నయ్య సిబ్బందితో అక్కడకు చేరుకుని క్వారీ గుంటను పరిశీలించారు. ఈ క్వారీ నాలుగేళ్లుగా వినియోగంలో లేదని స్థానికులు చెప్పారు. గతంలో ఈ క్వారీ పసుపులేటి సంజీవరావు ఆధ్వర్యంలో ఉండేదని వారు తెలిపారు. క్వారీ గుంట నిండా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాటు, ఈ గుంటలో నీటి ఊట కూడా వస్తుందని, చాలా లోతుగా ఉంటుందని వివరించారు. పోలీసులు క్వారీ యజమానిపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.
ఎమ్మెల్యే రావెల పరామర్శ
ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. శ్రీనివాసరావు, జ్యోతి దంపతులను ఓదార్చారు. క్వారీలో పాడుపడిన నీటి గుంట ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకునేలా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువెళతానన్నారు. చిన్నారుల అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందజేశారు.
దేవుడు అన్యాయం చేశాడయ్యా...
అల్లారు ముద్దుగా పెంచుకునే తమ ముగ్గురు మహలక్ష్ముల్లాంటి చిన్నారులను ఒక్కసారిగా తమకు లేకుండా చేసి దేవుడు అన్యాయం చేశాడంటూ చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక మేమెవరి కోసం బతకాలంటూ రోదించారు.