
ముగ్గుర్ని బలిగొన్న తాచుపాము
కర్నూలు జిల్లా కోసిగి మండలం, కందుకూరులో పాముకాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తన కుమార్తెలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని కలతచెందిన ఓ తండ్రి తన పరిస్థితిని గమనించలేక పోయాడు.
మంత్రాలయం: కర్నూలు జిల్లా కోసిగి మండలం, కందుకూరులో పాముకాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తన కుమార్తెలు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని కలతచెందిన ఓ తండ్రి తన పరిస్థితిని గమనించలేక పోయాడు. చివరికి తన బిడ్డలను రక్షించుకోలేకపోయాడు. తానూ విగత జీవుడయ్యాడు. ఇదీ గ్రామానికి చెందిన తిమ్మయ్య ,భాగ్యమ్మల ఇంట నెలకొన్న విషాదం. వారికి పవిత్ర, పల్లవి, అంజలి, అనిత సంతానం. తమ పొలంలోనే రేకుల షెడ్డు వేసుకుని 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. వారంతా గాఢ నిద్రలో ఉండగా ఆదివారం తెల్లవారుజామున 2 గంటల వేళ ఓ తాచు పాము తిమ్మయ్యతో పాటు పల్లవి(6), అంజలి(4)ని కాటేసింది. బాధతో పల్లవి ఏడుస్తుండడతో తల్లి లేచి పామును గమనించింది.
అప్పటికే అది మరో ఇద్దరిని కాటేసింది. ఈ హడావుడిలో తననూ కాటేసిన విషయం పట్టించుకోని తిమ్మయ్య కూతుళ్లను రక్షించుకునేందుకు మోటారు సైకిల్‌పై భార్యతో కలిసి నాటు వైద్యం నిమిత్తం కౌతాళం మండలం కరణి గ్రామానికి బయలు దేరాడు. పరిస్థితి విషమించి పల్లవి దారిలోనే మరణించింది. అయినా అంజలిని రక్షించుకునేందుకు కరణికి వెళ్లినా.. చికిత్స మొదలుపెట్టే లోగానే ఆమే మృతి చెందింది. ఆ తర్వాత తిమ్మయ్య స్పృహ కోల్పోయాడు. చికిత్స నిమిత్తం ఆదోనికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.