జిల్లాకు మరో జేసీ | Three Joint Collectors to the district In AP | Sakshi
Sakshi News home page

జిల్లాకు మరో జేసీ

Published Sun, Apr 26 2020 2:19 AM | Last Updated on Sun, Apr 26 2020 4:49 AM

Three Joint Collectors to the district In AP - Sakshi

సాక్షి, అమరావతి: పాలనా వ్యవస్థలో మరింత జవాబుదారీతనం తీసుకురావడానికి.. అవినీతి రహితంగా పాలన సాగించడానికి.. సమాజంలోని అన్ని వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమ ఫలాలు అందించడానికి జిల్లా యంత్రాంగంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం జిల్లాల్లో ఇద్దరేసి జాయింట్‌ కలెక్టర్లు ఉన్నారు. తాజాగా ఇప్పుడు మరో జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును ప్రభుత్వం సృష్టించనుంది. ఈ పోస్టులో సీనియర్‌ టైమ్‌ స్కేలు ఉన్న ఐఏఎస్‌ అధికారిని నియమించనున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కొత్తగా నియమితులు కానున్న జేసీకి అప్పగించనున్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చడంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకంగా పనిచేస్తున్న విషయం విదితమే. కొత్తగా జాయింట్‌ కలెక్టర్‌ పోస్టు ఏర్పాటుచేస్తుండడంతో.. ఇక నుంచి ప్రతి జిల్లాలో మొత్తం ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లు ఉంటారు. పని విభజన విషయంలో ముగ్గురు జేసీలకు ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వనుంది. ఏ జాయింట్‌ కలెక్టర్‌ ఏ పథకాలను పర్యవేక్షించాలో, ఏఏ విభాగాలను చూడాలనే విషయంలో ఉన్నతాధికారులు విస్పష్టంగా జాబితా రూపొందించారు. చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సేవలు.. సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా, సజావుగా అందించాలన్నదే ఈ మార్పు లక్ష్యమని సమాచారం. ఈ ముగ్గురు జేసీలు జిల్లా కలెక్టర్‌కు పాలనలో సహకారం అందిస్తారు.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సీనియర్‌ టైమ్‌ స్కేలులో ఐఏఎస్‌ అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కలెక్టర్లుగా బాధ్యత స్వీకరించే ముందే వారికి క్షేత్రస్థాయిలో పాలన అనుభవం అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్‌ సివిల్‌ సర్వీసు (ఎస్‌సీఎస్‌) అధికారులకు, నాన్‌–ఎస్‌సీఎస్‌ అధికారులకూ ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందడానికి ముందు క్షేత్రస్థాయిలో విశేష అనుభవం అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి పాలనా వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.   

మార్పులు ఇలా..
1 జాయింట్‌ కలెక్టర్‌–1ను ఇక మీదట జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా మరియు రెవెన్యూ)గా పునర్యవస్థీకరించనున్నారు. వీరిని జేసీ–ఆర్‌బీ అండ్‌ ఆర్‌గా పిలుస్తారు. వీరు రైతు భరోసా మొదలు వ్యవసాయం, అనుబంధ రంగాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇసుక, గనులు, ఎక్సైజ్, శాంతిభద్రతలు తదితర విభాగాలకూ బాధ్యత వహించాలి. రెవెన్యూ విభాగం, సబ్‌ కలెక్టర్లనూ పర్యవేక్షించాలి.

2 ‘జాయింట్‌ కలెక్టర్‌–విలేజ్‌ అండ్‌ వార్డు సెక్రటేరియట్‌’ అని కొత్త పోస్టు సృష్టించనున్నారు. వీరిని జేసీ–వీ అండ్‌ డబ్ల్యూఎస్‌గా పిలుస్తారు. ఈ పోస్టులో సీనియర్‌ టైమ్‌ స్కేలు ఉన్న ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు పలు సంక్షేమ
పథకాల అమలును పర్యవేక్షిస్తారు.

3 ఇప్పుడున్న జాయింట్‌ కలెక్టర్‌–2ను జాయింట్‌ కలెక్టర్‌–హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌గా పునర్యవస్థీకరించనున్నారు. ఇది నాన్‌–క్యాడర్‌ పోస్టు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ
కలెక్టర్‌ స్థాయి ఎస్‌సీఎస్‌/నాన్‌–ఎస్‌సీఎస్‌ కేడర్‌ను ఈ పోస్టులో నియమిస్తారు.వీరు జిల్లాలో వైద్య, ఆరోగ్య విభాగం, విద్యా శాఖను పర్యవేక్షిస్తారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, దిశ చట్టం అమలు బాధ్యతలు చూడనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement