* మృతుల సంఖ్య పెరిగే అవకాశం
* బాధితులు పుంగనూరు మండలం బోడేవారిపల్లెకు చెందినవారు
* బోయకొండ గంగమ్మను దర్శించుకుని వెళుతుండగా ప్రమాదం
చౌడేపల్లి (చిత్తూరు జిల్లా): ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలో చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతిచెందగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. బోయకొండ ఆలయానికి ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పుంగనూరు మండలం బోడేవారిపల్లికి చెందిన 50 మంది భక్తులు ట్రాక్టర్‌లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళుతుండగా ట్రాక్టర్ లోయలోపడింది. ట్రాక్టర్ 20 అడుగుల లోతులో పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులతో పాటు స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి ట్రాక్టర్ కింద పడిన మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోయ లోతుగా ఉండడంతో ప్రత్యేకంగా క్రేన్ తెప్పిస్తున్నారు.
ఇప్పటి వరకూ ఐదు మృత దేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దాదాపు 30 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షాలు పడితే ఇంటికొకరు చొప్పున వచ్చి బోయకొండ గంగమ్మను దర్శించుకుంటామని గతంలో మొక్కుకున్నారని, అందులో భాగంగానే బోడేవారిపల్లి గ్రామస్తుల ట్రాక్టర్‌లో వచ్చారని పోలీసులు తెలిపారు. ఇప్పటిదాకా వెలికితీసిన ఐదు మృతదేహాల్లో ఇద్దరిని గుర్తించారు. వెంకటేశు(23), బాలాజీ(24) మృతదే హాలను గుర్తించారు.
ట్రాక్టర్ లోయలోపడి ఐదుగురు మృతి; 30 మందికి గాయాలు
Published Sun, Jun 7 2015 5:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM
Advertisement
Advertisement