చిన్నకోడూరు/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: రాజీవ్ రహదారిపై ములుగు సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, అందులో ముగ్గురు జిల్లా వాసులున్నారు. దీంతో మృతుల స్వగ్రామాలైన చిన్నకోడూరు మండలం రామంచ, గంగాపూర్, సిద్దిపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లిల్లో విషాదం నెలకొంది. మూడు కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ఆస్పత్రిలో ఉన్న రక్త సంబంధీకురాలిని పరామర్శించి ఆమెను మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో వీరంతా మృత్యువాతపడ్డారు. మృతుల్లో రామంచ గ్రామానికి చెందిన రాధారం లక్ష్మి(45), గంగాపూర్‌వాసి దరిపల్లి స్వామి(22), పెద్దలింగారెడ్డిపల్లి వాస్తవ్యుడైన కారు డ్రైవర్ పడిగె శ్రీనివాస్(25)లు ఉన్నారు.
ఒక్కగానొక్క కొడుకు ...
పెద్దమ్మను పరామర్శించేందుకు వెళ్లు బిడ్డా అని సాగనంపిన తల్లి...తన ఒక్కగానొక్క కుమారుడి మరణ వార్త విని గుండెలవిసేలా రోదించింది. నాగవ్వ, నారాయణలకు కుమారుడు దరిపల్లి స్వామి, సిద్దిపేటలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్దమ్మను పలకరించేందుకు వెళ్లి అర్ధాంతరంగా తనువు చాలించాడు. చేతికంది వచ్చిన కుమారుడు ఇక లేడనే నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు .
దేవుడా ఎంత పన్జేస్తివి..
అక్కను చూసి వస్తానని చెప్పిన సిద్దిపేట వెళ్లిన రాధారం లక్ష్మిని రోడ్డుప్రమాదం కబలించడంతో ఆమె భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు, కూతురు బోరున విలపించారు. తల్లి ఇక శాశ్వతంగా రాదనే తెలియడంతో పిల్లలిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో..దేవుడా ఎంత పన్జేస్తివి..అంటూ వాళ్లు విలపిస్తున్న సన్నివేశాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి.
కూలీ కుటుంబానికి షాక్..
పడిగె బాగవ్వ, సత్తయ్య దంపతులకు కుమారుడు శ్రీనివాస్. టెన్త్ వరకు చదివిన అతడు కూలీలైన తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్న తపనతో కారు డ్రైవరుగా పని చేస్తుండేవాడు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు కిరాయి రావడంతో ఇంట్లో చెప్పి బయల్దేరాడు. మరో గంటైతే గాంధీ ఆస్పత్రికి చేరే లోగానే కారు ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీనివాస్ సంఘటనా స్థలంలోనే ఊపిరి విడిచాడు. చెట్టంత కుమారుడు అకాల మరణం చెందడంతో కన్నవారు, తోబుట్టువుల రోదనలు మిన్నంటాయి. వారని సముదాయించడం ఎవరి తరమూ కాలేదు.
పలకరించేందుకు వెళ్లి.. పరలోకానికి
Published Thu, Dec 5 2013 6:27 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement