Rajiv Rahadari
-
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
మల్లన్నా.. ఏందన్నా ఇది?
శామీర్‌పేట్: రైతు వేదికలను ప్రారంభించేందుకు గాను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుక్రవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు రామ మందిరం నిర్మాణంపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ మజీద్‌పూర్ వద్ద మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌ని ఆపి నిరసన తెలిపేందుకు రాజీవ్‌రహదారిపై బైఠాయించారు. దీనిపై సమాచారం అందడంతో మంత్రి కాన్వాయ్ అలియాబాద్ చౌరస్తా వరకు రాజీవ్ రహదారిలో రాంగ్ రూట్లో అక్కడి నుంచి వెళ్లి పోయారు. రాంగ్ రూట్ లో వెళ్లిన మంత్రి వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తారా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
రహదారి దిగ్బంధం
పోలీసు వలయంలో రాజీవ్ రహదారి వంటిమామిడి వద్ద చెక్‌పోస్టు, విస్తృత తనిఖీలు భారీగా మోహరించిన బలగాలు పర్యవేక్షించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ వర్గల్/ములుగు: రాజీవ్ రహదారిని పోలీసులు దిగ్బంధించారు. జిల్లా సరిహద్దు వంటిమామిడి వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వరుసగా రెండోరోజైన మంగళవారం రోజంతా తనిఖీ లను కొనసాగించారు. మల్లన్న సా గర్ నిర్వాసితులకు సంఘీభావంగా కాంగ్రెస్ నేతలు వస్తున్నారనే సమాచారంతో చెక్ పోస్టు భారీగా బలగాలను మోహరించారు. ప్రతి వాహనా న్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వంటిమామిడి వద్ద ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు తనిఖీలు కొనసాగాయి. మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి డీఎస్పీలు శ్రీధర్, నాగరాజు, తిరుపతయ్య ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మందికిపైగా పోలీసులు తనిఖీ లు చేపట్టారు. మహిళా నేతలను అరెస్ట్ చేసేందుకు వీలుగా పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను రంగంలోకి దింపారు. వర్షంలోనూ కొనసాగించారు. అనుమానితులను ఏ ఒక్కరిని వదలకుండా ఆర్టీసీ బస్సులను, కార్లను, ఇతర వాహనాలను సైతం తనిఖీ చేశారు. చెక్‌పోస్టును సందర్శించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీ వంటిమామిడి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును మంగళవారం ఉదయం హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకు¯ŒS సబర్వాల్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సందర్శించారు. అక్కడి పరిస్థితి సమీక్షించారు. ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి దాదాపు గంటపాటు చెక్ పోస్టు వద్దే ఉండి పరిస్థితి అంచనా వేస్తూ పోలీసులకు తగు ఆదేశాలిచ్చారు. -
రాజీవ్ రహదారికి రాజయోగం
* రూ.850 కోట్లతో కొత్తరూపం * 13 ప్రాంతాల్లో బైపాస్‌ల నిర్మాణం * సిద్దిపేట-కరీంనగర్ జంక్షన్ వద్ద ఫై్లఓవర్ * సిద్దిపేట-వరంగల్ జంక్షన్ వద్ద అండర్‌పాస్ * ఆర్అండ్బీ అధికారుల ప్రతిపాదనకు సీఎం ఆమోదం.. త్వరలో పనులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: నిర్మాణ లోపాలతో వాహనదారులను భయపెడుతున్న రాజీవ్ రహదారికి కొత్త రూపం ఇచ్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. దాదాపు రూ.850 కోట్లతో రహదారిని అభివృద్ధి పరచనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపటంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 248 కిలోమీటర్ల మేర విస్తరించిన రాజీవ్ హైవేను 2010లో నాలుగు లేన్లుగా విస్తరించే పని మొదలు పెట్టి ఇటీవలే పూర్తిచేశారు. కానీ శాస్త్రీయత లోపించటంతో రహదారిపై వాహన ప్రమాదాలు తీవ్రమయ్యాయి. రైలు మార్గం లేని ప్రాంతం కావటంతో ఈ రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. సరుకు రవాణా వాహనాలతోపాటు ప్రయాణికులను తరలించే వాహనాలతో నిత్యం బిజీగా ఉంటుంది. ఈ రహదారిలో నిర్మాణ లోపాలను వెంటనే సరిదిద్దాలని గత జూలైలో సీఎం అధికారులను ఆదేశించారు. ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో సర్వే చేయించిన రోడ్లు, భవనాల శాఖ అధికారులు తాజాగా సీఎంకు నివేదిక అందించారు. ఏం చేస్తారు..? * నాలుగు లేన్లుగా విస్తరించిన రోడ్డుపై వాహనాల వేగం బాగా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఊరి మధ్య నుంచి రోడ్డు ఉండటం అశాస్త్రీయం. కానీ పదమూడు ఊళ్ల మధ్య నుంచి రాజీవ్ రహదారి ఉంది. ఇప్పుడు ఈ 13 ప్రాంతాల్లో కొత్తగా బై-పాస్‌లు నిర్మిస్తారు. ఊళ్ల మీదుగా సర్వీసు రోడ్డు కొనసాగుతుంది. లారీలు, ఆ ఊళ్లో ఆగాల్సిన అవసరం లేని బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఊరి మీదుగా కాకుండా బై-పాస్ మీదుగా ముందుకు సాగుతాయి. బై-పాస్‌ల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లతో ప్రైవేటు భూమిని సేకరించనున్నారు. * శామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటిమామిడి, ములుగు, గౌరారం, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి వద్ద బై-పాస్‌లు నిర్మిస్తారు. * సిద్దిపేట వెలుపల సిద్దిపేట-కరీంనగర్ బై-పాస్ కూడలి వద్ద దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫై్లఓవర్ నిర్మిస్తారు. సిద్దిపేటకు వెళ్లే వాహనాలు, బై-పాస్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు అక్కడ వేరుపడతాయి. * సిద్దిపేట శివారులోని ఎల్కతుర్తి సమీపంలో సిద్దిపేట-వరంగల్ జంక్షన్ వద్ద భారీ అండర్ పాస్ నిర్మిస్తారు. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పైనుంచి వెళ్లనుండగా, ప్రధాన కారిడార్ అండర్ పాస్ నుంచి ముందుకు సాగుతుంది. * ఈ రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల వద్ద ప్రత్యేంగా బస్-బేలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులను తీసుకువెళ్లే బస్సులు రోడ్డుపై ఆగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున... కొంత దిగువకు వెళ్లి ఆగుతాయి. ఇందుకు 20 ఎకరాలను సేకరిస్తారు. సెంట్రల్ మీడియం అలాగే... నాలుగు లేన్ల రోడ్లలో సాధారణంగా సెంట్రల్ మీడియం 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ రోడ్డుపై కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల ఫోకస్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేయాలంటే రోడ్డు పొడవునా ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుంది. చాలాచోట్ల నిర్మాణాలు తొలగిం చాలి. ఇది ఇప్పుడు కుదిరే పనికాకపోవటంతో దాన్ని అలాగే వదిలేయాలని నిర్ణయించారు. ఈ దారి లోపాల పుట్ట.. రాజీవ్ రహదారి విస్తరణ పనిని తొలుత రూ.750 కోట్లతో ప్రతిపాదించినా చివరికి రూ. 1,400 కోట్ల మేర ఖర్చు చేశారు. శాస్త్రీయతను గాలికొదిలి ఇష్టం వచ్చినట్టు నిర్మిం చటంతో ప్రమాదాలు తీవ్రమయ్యాయి. ఈ హైవేపై గత నాలుగేళ్లలో దాదాపు 600 మం ది వరకు మృత్యువాతపడ్డారని అంచనా. లోపాలను పరిశీలించేందుకు 2012లో ప్రభుత్వం సభాసంఘాన్ని నియమించింది. ఉన్నట్టుండి పెద్దపెద్ద మలుపులు, ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం, పశువులు రోడ్డెక్కకుండా ఏర్పాట్లు లేకపోవటం, వాన నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు లేకపోవటం, ఇరుకైన సెంట్రల్ మీడియం.. ఇలాంటి లోపాలున్నాయని కమిటీ నివేదిక సమర్పించింది. కానీ దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
పలకరించేందుకు వెళ్లి.. పరలోకానికి
చిన్నకోడూరు/సిద్దిపేట రూరల్, న్యూస్‌లైన్: రాజీవ్ రహదారిపై ములుగు సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, అందులో ముగ్గురు జిల్లా వాసులున్నారు. దీంతో మృతుల స్వగ్రామాలైన చిన్నకోడూరు మండలం రామంచ, గంగాపూర్, సిద్దిపేట మండలం పెద్దలింగారెడ్డిపల్లిల్లో విషాదం నెలకొంది. మూడు కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ఆస్పత్రిలో ఉన్న రక్త సంబంధీకురాలిని పరామర్శించి ఆమెను మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో వీరంతా మృత్యువాతపడ్డారు. మృతుల్లో రామంచ గ్రామానికి చెందిన రాధారం లక్ష్మి(45), గంగాపూర్వాసి దరిపల్లి స్వామి(22), పెద్దలింగారెడ్డిపల్లి వాస్తవ్యుడైన కారు డ్రైవర్ పడిగె శ్రీనివాస్(25)లు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు ... పెద్దమ్మను పరామర్శించేందుకు వెళ్లు బిడ్డా అని సాగనంపిన తల్లి...తన ఒక్కగానొక్క కుమారుడి మరణ వార్త విని గుండెలవిసేలా రోదించింది. నాగవ్వ, నారాయణలకు కుమారుడు దరిపల్లి స్వామి, సిద్దిపేటలో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం అనారోగ్యంతో బాధపడుతున్న తన పెద్దమ్మను పలకరించేందుకు వెళ్లి అర్ధాంతరంగా తనువు చాలించాడు. చేతికంది వచ్చిన కుమారుడు ఇక లేడనే నిజాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు . దేవుడా ఎంత పన్జేస్తివి.. అక్కను చూసి వస్తానని చెప్పిన సిద్దిపేట వెళ్లిన రాధారం లక్ష్మిని రోడ్డుప్రమాదం కబలించడంతో ఆమె భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు, కూతురు బోరున విలపించారు. తల్లి ఇక శాశ్వతంగా రాదనే తెలియడంతో పిల్లలిద్దరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో..దేవుడా ఎంత పన్జేస్తివి..అంటూ వాళ్లు విలపిస్తున్న సన్నివేశాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి. కూలీ కుటుంబానికి షాక్.. పడిగె బాగవ్వ, సత్తయ్య దంపతులకు కుమారుడు శ్రీనివాస్. టెన్త్ వరకు చదివిన అతడు కూలీలైన తన తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలన్న తపనతో కారు డ్రైవరుగా పని చేస్తుండేవాడు. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు కిరాయి రావడంతో ఇంట్లో చెప్పి బయల్దేరాడు. మరో గంటైతే గాంధీ ఆస్పత్రికి చేరే లోగానే కారు ప్రమాదానికి గురైంది. దీంతో శ్రీనివాస్ సంఘటనా స్థలంలోనే ఊపిరి విడిచాడు. చెట్టంత కుమారుడు అకాల మరణం చెందడంతో కన్నవారు, తోబుట్టువుల రోదనలు మిన్నంటాయి. వారని సముదాయించడం ఎవరి తరమూ కాలేదు.