రాజీవ్ రహదారికి రాజయోగం
* రూ.850 కోట్లతో కొత్తరూపం
* 13 ప్రాంతాల్లో బైపాస్‌ల నిర్మాణం
* సిద్దిపేట-కరీంనగర్ జంక్షన్ వద్ద ఫై్లఓవర్
* సిద్దిపేట-వరంగల్ జంక్షన్ వద్ద అండర్‌పాస్
* ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రతిపాదనకు సీఎం ఆమోదం.. త్వరలో పనులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ లోపాలతో వాహనదారులను భయపెడుతున్న రాజీవ్ రహదారికి కొత్త రూపం ఇచ్చేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. దాదాపు రూ.850 కోట్లతో రహదారిని అభివృద్ధి పరచనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపటంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు 248 కిలోమీటర్ల మేర విస్తరించిన రాజీవ్ హైవేను 2010లో నాలుగు లేన్లుగా విస్తరించే పని మొదలు పెట్టి ఇటీవలే పూర్తిచేశారు. కానీ శాస్త్రీయత లోపించటంతో రహదారిపై వాహన ప్రమాదాలు తీవ్రమయ్యాయి.
రైలు మార్గం లేని ప్రాంతం కావటంతో ఈ రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. సరుకు రవాణా వాహనాలతోపాటు ప్రయాణికులను తరలించే వాహనాలతో నిత్యం బిజీగా ఉంటుంది. ఈ రహదారిలో నిర్మాణ లోపాలను వెంటనే సరిదిద్దాలని గత జూలైలో సీఎం అధికారులను ఆదేశించారు. ఓ ప్రైవేటు కన్సల్టెన్సీతో సర్వే చేయించిన రోడ్లు, భవనాల శాఖ అధికారులు తాజాగా సీఎంకు నివేదిక అందించారు.
ఏం చేస్తారు..?
* నాలుగు లేన్లుగా విస్తరించిన రోడ్డుపై వాహనాల వేగం బాగా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఊరి మధ్య నుంచి రోడ్డు ఉండటం అశాస్త్రీయం. కానీ పదమూడు ఊళ్ల మధ్య నుంచి రాజీవ్ రహదారి ఉంది. ఇప్పుడు ఈ 13 ప్రాంతాల్లో కొత్తగా బై-పాస్‌లు నిర్మిస్తారు. ఊళ్ల మీదుగా సర్వీసు రోడ్డు కొనసాగుతుంది. లారీలు, ఆ ఊళ్లో ఆగాల్సిన అవసరం లేని బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఊరి మీదుగా కాకుండా బై-పాస్ మీదుగా ముందుకు సాగుతాయి. బై-పాస్‌ల నిర్మాణానికి దాదాపు రూ.200 కోట్లతో ప్రైవేటు భూమిని సేకరించనున్నారు.
* శామీర్‌పేట, తుర్కపల్లి, ఒంటిమామిడి, ములుగు, గౌరారం, ప్రజ్ఞాపూర్, కొడకండ్ల, కుకునూర్‌పల్లి, దుద్దెడ, రామునిపట్ల, ఇబ్రహీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి వద్ద బై-పాస్‌లు నిర్మిస్తారు.
* సిద్దిపేట వెలుపల సిద్దిపేట-కరీంనగర్ బై-పాస్ కూడలి వద్ద దాదాపు 800 మీటర్ల పొడవుతో నాలుగు లేన్ల ఫై్లఓవర్ నిర్మిస్తారు. సిద్దిపేటకు వెళ్లే వాహనాలు, బై-పాస్ మీదుగా కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు అక్కడ వేరుపడతాయి.
* సిద్దిపేట శివారులోని ఎల్కతుర్తి సమీపంలో సిద్దిపేట-వరంగల్ జంక్షన్ వద్ద భారీ అండర్ పాస్ నిర్మిస్తారు. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పైనుంచి వెళ్లనుండగా, ప్రధాన కారిడార్ అండర్ పాస్ నుంచి ముందుకు సాగుతుంది.
* ఈ రోడ్డును ఆనుకుని ఉన్న 68 గ్రామాల వద్ద ప్రత్యేంగా బస్-బేలను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులను తీసుకువెళ్లే బస్సులు రోడ్డుపై ఆగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున... కొంత దిగువకు వెళ్లి ఆగుతాయి. ఇందుకు 20 ఎకరాలను సేకరిస్తారు.
సెంట్రల్ మీడియం అలాగే...
నాలుగు లేన్ల రోడ్లలో సాధారణంగా సెంట్రల్ మీడియం 4.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కానీ ఈ రోడ్డుపై కేవలం 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఎదురుగా వచ్చే వాహనాల ఫోకస్ లైట్లు డ్రైవర్లకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు దాన్ని వెడల్పు చేయాలంటే రోడ్డు పొడవునా ప్రైవేటు భూమిని సేకరించాల్సి ఉంటుంది. చాలాచోట్ల నిర్మాణాలు తొలగిం చాలి. ఇది ఇప్పుడు కుదిరే పనికాకపోవటంతో దాన్ని అలాగే వదిలేయాలని నిర్ణయించారు.
ఈ దారి లోపాల పుట్ట..
రాజీవ్ రహదారి విస్తరణ పనిని తొలుత రూ.750 కోట్లతో ప్రతిపాదించినా చివరికి రూ. 1,400 కోట్ల మేర ఖర్చు చేశారు. శాస్త్రీయతను గాలికొదిలి ఇష్టం వచ్చినట్టు నిర్మిం చటంతో ప్రమాదాలు తీవ్రమయ్యాయి. ఈ హైవేపై గత నాలుగేళ్లలో దాదాపు 600 మం ది వరకు మృత్యువాతపడ్డారని అంచనా. లోపాలను పరిశీలించేందుకు 2012లో ప్రభుత్వం సభాసంఘాన్ని నియమించింది.
ఉన్నట్టుండి పెద్దపెద్ద మలుపులు, ఊళ్ల మీదుగా రోడ్డు నిర్మాణం, పశువులు రోడ్డెక్కకుండా ఏర్పాట్లు లేకపోవటం, వాన నీళ్లు నిలవకుండా ఏర్పాట్లు లేకపోవటం, ఇరుకైన సెంట్రల్ మీడియం.. ఇలాంటి లోపాలున్నాయని కమిటీ నివేదిక సమర్పించింది. కానీ దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.