విధి విడదీసింది... | Three people died in road accident | Sakshi
Sakshi News home page

విధి విడదీసింది...

Published Thu, May 29 2014 11:25 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

Three people died in road accident

వారిద్దరూ ప్రాణ స్నేహితులు ఒకరిది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, మరొకరిది తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి. రాజకీయ నేతల స్వార్థం రాష్ట్రాల్ని విడదీసినా వారి స్నేహాన్ని మాత్రం విడదీయలేకపోయింది. వేసవి సెలవుల్లో రెండు కుటుంబాలు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాయి. కానీ... తిరుగు ప్రయాణంలో విధి వారిద్దరినీ విడదీసింది. ప్రత్తిపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
 
 ప్రత్తిపాడు, న్యూస్‌లైన్: ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద కాటూరి వైద్య కళాశాల సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులైన జగ్గయ్యపేటకు చెందిన కుందేలు రవికిరణ్, సత్తుపల్లికి చెందిన దూదిపాళ్ల ప్రభు వేసవి సెలవుల్లో సకుటుంబసమేతంగా తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకున్నారు.
 
 ఈనెల 23వ తేదీ శుక్రవారం కుందేలు రవికిరణ్ తన కుటుంబసభ్యులైన తల్లి రాజ్యం, భార్య శ్రీదేవి, కుమార్తె గాయత్రి, కుమారుడు హవీష్, ప్రాణ స్నేహితుడు దూదిపాళ్ల ప్రభు, అతని భార్య శ్రీదేవి, కుమార్తెలు యోజిత, చేతనలతో కలిసి మొత్తం రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిదిమంది కారులో తిరుపతి బయలుదేరి వెళ్లారు. తిరుపతి, కంచి పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి బుధవారం సాయంత్రం జగ్గయ్యపేటకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో వేగంగా వస్తున్న కారు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కాటూరి మెడికల్ కళాశాలకు సమీపంలో నిర్మించిన వంతెనను ఢీకొట్టింది.
 
 ఈ ప్రమాదంలో రవికిరణ్ (38)తో అతని తల్లి రాజ్యం (63), స్నేహితుడు ప్రభు కుమార్తె యోజిత (8) మృత్యువాత పడ్డారు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలముకుంది. ఒక కుటుంబం తల్లీ కొడుకును కోల్పోగా, మరో కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కన్నకూతురిని కోల్పోయింది.
 రవి ఎలా ఉన్నాడు... తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దూదిపాళ్ల ప్రభు భరించలేని గాయాల దెబ్బలను సైతం పంటిబిగువున భరిస్తూ, తన స్నేహితుడి యోగక్షేమాలను ఆరా తీయడం అందరిని కలిచివేసింది. స్ట్రెచర్‌పై చికిత్స పొందుతూనే తనకు వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులతో రవి ఎలా ఉన్నాడు.. వాడికేం ఇబ్బందిలేదుగా.. అంటూ అడిగాడు. తీవ్ర గాయాలతో బాధపడుతూ కూడా తన స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం చూసిన వారు వారి స్నేహ బంధాన్ని తలచుకుని కంటతడి పెట్టుకున్నారు.
 
 అమ్మా.. ఒక్కసారి లేమ్మా..
 కుందేలు రవికిరణ్, అతిని తల్లి రాజ్యం మృతిచెందారన్న విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు, బంధువులు ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడులోని కాటూరి వైద్యశాల వద్దకు చేరుకున్నారు. మృతుల రక్తసంబంధీకురాలు (ఒకరికి కుమార్తె, ఒకరికి చెల్లి) భోరున విలపించారు. విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలపై పడి అమ్మా లేవే.. ఒక్కసారి నాతో మాట్లాడవే.. ఏమిటే ముఖంపై ఇన్ని దెబ్బలు నీకు.. ఎలా ఓర్చుకున్నావమ్మా.. అన్నా లే అన్నా.. ఒక్కసారి లే అన్నా.. అంటూ పెద్దపెద్దగా ఏడవడంతో ఆస్పత్రి ప్రాంగణం అంతా బంధువుల రోదనలతో మార్మోగింది.
 
 నొప్పులతో ఎగిరెగిరి పడుతూ.. ప్రమాదం బారిన పడిన వారిలో నలుగురు చిన్నారులు ఉండడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తలకు, కాళ్లకు, చెవులకు, చేతులతో పాటు పలు భాగాల వద్ద తీవ్ర గాయాలవడంతో నొప్పులు భరించలేక ఆ చిన్నారులు అల్లాడిపోయారు. వైద్య సిబ్బంది వైద్యం చేయడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ చిన్నారులు నొప్పులతో ఎగిరెగిరిపడుతూ ఎక్కిళ్లు పెట్టి ఏడవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది. చిన్నారులకు ఎంత కష్టం వచ్చింది దేవుడా అంటూ విలపించారు,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement