రక్తం చిందిన రోడ్లు
Published Mon, Feb 3 2014 3:15 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ వద్ద ట్రాక్టర్ బోల్తా ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందగా, ద్విచక్రవాహనంపై అతివేగంగా వెళ్తూ పలాస ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తులసికోటకు ఢీకొని ఓ యువకుడు తనువు చాలించాడు. భవన నిర్మాణ పని ముగించుకుని ఇంటికి వస్తున్న ఓ మహిళను లారీ రూపంలో మృత్యువు కబళించింది.
బొడ్డగూడ(భామిని). న్యూస్‌లైన్: పెళ్లి పందిరికి అవసరమైన కర్రలు తెచ్చేందుకు కొండకు వెళ్లిన మండలంలోని బురజోల గ్రామానికి చెందిన గిరిజనుడు దుర్మరణం చెందగా, మరో 8 మంది గాయపడ్డారు. భామిని మండలం బొడ్డగూడ ఘాటీ రోడ్డులో ట్రాక్టర్ బ్రేకులు పట్టకపోవడంతో బోల్తా పడింది. దీంతో కర్రలలోడుతో ఉన్న తొట్టెకింద ఉండిపోయిన బురజోలకు చెందిన గిరిజనుడు మిలగాం కృష్ణమూర్తి(50) అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ మిలగాం సుదర్శన్, ముచ్చర్ల కృష్ణమూర్తి, కోడూరు నూకయ్య, కలిశెట్టి మధుసూదన్, బిడ్డిక చంటి, అల్లు లోకేష్, కలిశెట్టి కేశవరావు, పత్తిక నూకయ్యలు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని 108లో కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కోడూరు నూకయ్య, ముచ్చర్ల కృష్ణమూర్తిలను శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లారు. పత్తిక నూకయ్య, కేశవరావును పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బత్తిలి ఎస్‌ఐ సీహెచ్ రామారావు కృష్ణమూర్తి మృతదేహానికి శవపంచనామా జరిపి పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాద స్థలానికి భామిని, బురుజోల, అనంతగిరి తదితర గ్రామాలనుంచి మృతుడు, క్షతగాత్రుల బంధువులు చేరుకుని బోరున విలపించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బురజోల మాజీ సర్పంచ్ ప్రకాశరావు, పత్తిక సింహాచలం, సర్పంచ్ ప్రతినిధి సాకేటి రామారావు, బోగాపురపు అప్పలనాయుడులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో పోలీసులకు సహకరించారు.
కొత్తూరులో ఆటో బోల్తా...
కొత్తూరు: మండలంలోని కురిగాం మలుపు వద్ద ఆటో బోల్తా పడడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి సమీపంలోని పాటపాడులో నీలగిరి తోటలు కొట్టేందుకు మదనాపురానికి చెందిన కూలీలు వెళ్లారు. అక్కడ పనిలేకపోవడంతో తిరిగి వస్తుండగా కురిగాం మలుపు వద్ద ఆటో ఆదుపు తప్పి బోల్తాపడడంతో గురాన వెంకటరావు, కలవల గోపాలు, కూరాకుల చిన్నయ్య, బిడ్డిక నాగరాజులు గాయపడ్డారు. వీరిని 108 సహాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ తలే రామారావు కేసునమోదు చేశారు. క్షతగాత్రులను కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
క్షతగాత్రులతోనిండిన కొత్తూరు ఆస్పత్రి....
కొత్తూరు, భామిని మండలాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో కొత్తూరు ప్రభుత్వాస్పత్రి నిండిపోయింది. క్షతగాత్రుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటాయి.
Advertisement