
మూడు ఇసుక రీచ్‌లకు మళ్లీ టెండర్లు
జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు తక్కువ రేటు దాఖలు చేసిన వ్యాపారులు
ఈ టెండర్ల రద్దుకు మైనింగ్ శాఖ అధికారుల ప్రతిపాదనలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలోని జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం ఇసుక రీచ్‌లకు మళ్ళీ టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 11న జిల్లాలోని ఏడు రీచ్‌లకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువగా టెండర్లు దాఖలైనా, అలాగే తక్కు వగా దాఖలైనా వాటిని రద్దు చేయాలనే ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అధికారులు మళ్లీ టెండర్లు ఆహ్వానించడానికి చర్యలు తీసుకుంటున్నారు. క్యూబిక్ మీటరుకు రూ.150 నుంచి రూ.500 లోపు రేటు వేయాల్సి ఉంటే జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు వరుసగా రూ.138, రూ.142, రూ.116 ల రేటును దాఖలు చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ.150 కంటే తక్కువగా ఉండడంతో వీటిని రద్దు చేయాలని మైనింగ్‌శాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు అందించారు. జిల్లా యంత్రాంగం వీటిని పరిశీలించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకున్న తరువాత రెండోసారి టెండర్లు ఆహ్వానిస్తారు. మిగిలిన నాలుగు రీచ్‌లకు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే టెండర్లు దాఖలు చేసినా, వాటిని ఇంకా అధికారులు ఖరారు చేయలేదు. వ్యాపారులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని రీచ్‌లను అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ రీచ్‌ల ఖరారుపై ఇంకా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో టెండర్లు ఖరారు చేయలేదు.
నదీ పరివాహక భూములపై సన్నగిల్లిన ఆశలు ...
ఇసుక రీచ్‌ల తరువాత జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో నదికి సమీపంలోని సొంత రైతుల్లో ఆశలు చిగు రించాయి. అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు నదీ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు అను కూలంగా లేకపోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో వ్యాపారులు ఏ రీచ్‌కు ఎక్కువ రేటు వేస్తారో ఆ రేటును పట్టా భూములు కలిగిన రైతులు చెల్లించాలనే నిబంధనల ఉండడంతో ఆ రైతులకు ఆశలు సన్నగిల్లాయి.
ఈ నెల 11న జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో క్యూబిక్ మీటరుకు రూ.356లను చెల్లించేందుకు కస్తల, కోనూరు వ్యాపారులు ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఈ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చిన వారికే నదీ పరివాహక ప్రాంతాల్లోని భూముల్లో ఇసుక తవ్వడానికి అధికారులు అనుమతి ఇస్తారు. అంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించి, అధికారులకు మామూళ్లు చెల్లిస్తే మిగిలేది పెద్దగా ఉండదనే ఉద్దేశంతో రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం అధికారులను ఈ భూములకు సంబంధించిన నిబంధనలు కూడా అడగడం లేదు.