అప్పటివరకూ తల్లితో ఉల్లాసంగా గడిపిన చిన్నారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. కళ్లెదుటే రక్తపు మడుగులో విగతజీవిగా మారిన బిడ్డను చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆ చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. తినుబండారాలు కొనుక్కునేందుకు తల్లితోపాటు దుకాణానికి వెళ్లిన పాప తిరిగి ఇంటికి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నిండు నూరేళ్లు జీవించాల్సిన కుమార్తె తన కళ్ల ముందే లారీ చక్రాల కింద నలిగిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. బాలాయపల్లి మండలం అంబలపూడి అరుంధతీయవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
నెల్లూరు / బాలాయపల్లి: మూడు సంవత్సరాల చిన్నారి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృతిచెందిన ఘటన మండలంలోని గూడూరు – వెంకటగిరి రోడ్డు మార్గంలో అంబలపూడి అరుంధతీయవాడ గ్రామ సమీపం వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండంలోని అంబలపూడి గ్రామానికి చెందిన రాపూరు ఈశ్వరయ్య, సురేఖల రెండో కుమార్తె సౌమ్య. ఈశ్వరయ్య ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సౌమ్య శుక్రవారం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. కాసేపటికి తల్లిని దుకాణానికి తీసుకెళ్లి తినుబండారాలు కొనివ్వమని అడిగింది. సురేఖ రోడ్డుకు అవతల ఉన్న దుకాణానికి సౌమ్యను తీసుకెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది.
ఈ క్రమంలో రోడ్డు పక్కన గూడూరు వైపు నుంచి వెంకటగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆపి ఉంది. అందులో నుంచి ప్రయాణికులు దిగుతున్నారు. బస్సు ముందు నుంచి సురేఖ, సౌమ్యలు రోడ్డు దాటుతున్నారు. ఈ సమయంలో ఓ లారీ బస్సును వెనుకనుంచి ఢీకొట్టబోయింది. స్థానికులు చూసి కేకలు వేయడంతో లారీ డ్రైవర్ బస్సును తప్పించి నేరుగా సౌమ్యను ఢీకొట్టాడు. బాలిక మీద నుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయింది. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత అతను పరారయ్యేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముందు వెళుతుండగా..
సురేఖ వెనుక వస్తుండగా సౌమ్య ముందు వెళుతోంది. కళ్లెదుటే ఘటన జరగడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సౌమ్య మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని గుండలవిసేలా విలపించింది. కేకలు పెడుతుండగా డ్రైవర్ సౌమ్యను ఢీకొట్టాడని గ్రామస్తులు చెబుతున్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment