నదిలోకి విసిరేసి చిన్నారి హత్య
- అన్న కుమారుడిని చంపేసిన తమ్ముడు
తాడేపల్లి: ఏడాదిన్నర వయసున్న చిన్నారిని సొంత బాబాయే కృష్ణానదిలోకి విసిరేసి హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లాలో సంచలనం కలిగించింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగినట్టుగా భావిస్తున్న ఈ సంఘటనలో మృతిచెందిన చిన్నారిని గురువారం తాడేపల్లి పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన చిన్నారి మోక్షజ్ఞతేజ (18 నెలలు)ను తెనాలిలో ఉంటున్న బాబాయి గోడపాటి హరిహరణ్ వారధిపై నుంచి నదిలోకి విసిరేసి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
పోలీసులు, కుటుంబసభ్యులు, బంధువుల కథనం మేరకు.. తెనాలి బాలాజీరావుపేటలోని మహేంద్రకాలనీకి చెందిన గోడపాటి రాంబాబు పొన్నూరులో ఏఎస్‌ఐగా పనిచేస్తున్నారు. అతడి ముగ్గురు కుమారుల్లో పెద్దవాడైన భాస్కరరావు భార్య విమలప్రియతో కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. భాస్కరరావు తమ కుమారుడు మోక్షజ్ఞతేజను తన తండ్రి వద్ద తెనాలిలో వదిలి వెళ్లారు. అతని పెద్ద తమ్ముడు చంద్రశేఖర్ ఉద్యోగంలో స్థిరపడగా, మూడో తమ్ముడు హరిహరణ్ ఇంజనీరింగ్ చదివి జులాయిగా తిరుగుతున్నాడు.
అతనిని ఇటీవల భాస్కరరావు మందలించారు. దీన్ని మనసులో పెట్టుకున్న హరిహరణ్ బుధవారం సాయంత్రం మోక్షజ్ఞతేజను బయటకు తీసుకెళ్లాడు. రాత్రికి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు వెతకనారంభించారు. ఈ క్రమంలో కృష్ణానది వద్దకు చేరుకున్న చంద్రశేఖర్‌కు కనకదుర్గమ్మవారధి వద్ద పెద్దసంఖ్యలో జనం కనిపించారు.
తానూ వెళ్లి చూడగా చిన్నారి మోక్షజ్ఞ నదిలో శవంగా కనిపించాడు. విషయాన్ని అక్కడకు చేరుకున్న మంగళగిరి రూరల్ సీఐ చిట్టెం కోటేశ్వరావు దృష్టికి తెచ్చాడు. దీంతో చిన్నారిని తీసుకువచ్చిన హరిహరణ్ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆస్పత్రికి తర లించారు.