చిలుకానగర్‌లో చిన్నారి తల లభ్యమైన ఇళ్లు ఇదే
సాక్షి, హైదరాబాద్: ఓ డాబాపై మూడు నెలల చిన్నారి తల.. ఎవరో ముష్కరులు చిన్నారి తలను తెగ్గోసి అక్కడ పడేశారు.. మొండెం ఆచూకీ లేకుండా చేశారు.. ఇది జరిగింది బుధవారం.. పౌర్ణమి, సంపూర్ణ చంద్ర గ్రహణం కావడంతో నరబలిగా కలకలం. సమీపంలోని జనంలో భయాందోళన.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని చిలుకానగర్‌లో జరిగిన ఘటన ఇది. రాజశేఖర్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ ఇంటి డాబాపై గురువారం ఉదయం చిన్నారి తలను గుర్తించారు. మొండెం ఆచూకీ లేకపోవడం, ఘటనా స్థలిలో పరిస్థితులను బట్టి ఇది నరబలి అయి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
డాబాపై తల కనిపించడంతో..
ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో నివసించే రాజశేఖర్ (35) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబమంతా మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆయన అత్త బాల లక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లారు. అక్కడ ఎవరో చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్.. వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారమిచ్చారు. చిన్నారి తల దొరికిందన్న వార్త దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా రాచకొండ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషి సహా పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
గ్రహణ సమయంలో బలి ఇచ్చారా?
డాబాపై కనిపించిన తల మూడు నెలల చిన్నారిదిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే మొండెం లభించకపోవడంతో ఆడపిల్లా, మగపిల్లాడా అన్నది తెలియలేదు. ప్రాథమికంగా లభించిన ఆధారాలు, రక్తం మరకలను బట్టి బుధవారమే హత్య జరిగి ఉంటుందని.. ఆ రోజున పౌర్ణమి, చంద్రగ్రహణం కూడా కావడంతో క్షుద్రపూజలు, నరబలి అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డాబాపై తల ఉన్న పరిస్థితిని బట్టి ఎవరో తెచ్చి అక్కడ పెట్టి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. తలపై కుడిచెవి పూర్తిగా తెగిపోయి ఉందని, దవడపై కత్తి గాట్లు ఉన్నాయని గుర్తించారు. ఇవన్నీ నరబలి అనుమానాలకు బలాన్నిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక చిన్నారి మొండెం కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, డ్రైనేజీలు, శ్మశాన వాటికల్లో గాలిస్తున్నారు.
]
అక్కడికక్కడే తిరిగిన జాగిలాలు
చిన్నారి మిస్సింగ్‌కు సంబంధించి ఉప్పల్ సహా చుట్టుపక్కల పోలీసుస్టేషన్లలో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఎవరైనా సంబంధీకులే ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇక పోలీసు జాగిలాలు కూడా చిన్నారి తల లభించిన డాబా పైనుంచి ఆ ఇంటి ముందుకు, ఎదురుగా ఉన్న నరహరి అనే వ్యక్తి ఇంటి వద్దకు తిరిగి రోడ్డు మీదకు వచ్చి ఆగాయి. అయితే ఈ రెండు ఇళ్లలోని ఓ ఇంట్లోని దేవుడి గది వరకూ జాగిలాలు వెళ్లినట్లు తెలిసింది. దీంతో క్షుద్రపూజల కోణంపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ రెండు ఇళ్లతో పాటు సమీపంలోని మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ముమ్మర దర్యాప్తు చేస్తున్నాం
‘‘చిలుకానగర్‌లోని ఓ ఇంటిపై చిన్నారి తల లభించింది. దీనిపై హత్య కేసు నమోదు చేసి, ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం. నిందితులను గుర్తించి, పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి..’’ – ఉమా మహేశ్వరశర్మ, మల్కాజ్‌గిరి డీసీపీ
ఉన్నత స్థాయి విచారణ జరగాలి
‘‘మూఢ నమ్మకాలతో పసిపిల్లల ఉసురు తీస్తున్నారు. చిలుకానగర్ ఘటన ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు కనబడుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి..’’
– అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment