
ఢీ అంటే ఢీ
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి
‘జగ్గారెడ్డి’.. ఈ పేరు ఓ ఫైర్ బ్రాండ్. వివాదాలకు కేంద్ర బింధువు. నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్. ‘అన్న నోరెత్తితే’ ఎంతటి వాళ్లయినా ‘తూర్పు’ తిరిగి దండం పెట్టాల్సిందే. సంగారెడ్డి అంటే టక్కున గుర్తొచ్చే పేరు జగ్గారెడ్డి. ఎదురే లేదు అనుకున్న ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి బరిగీశారు.
భర్తను రక్షణ కవచం చేసుకుని జగ్గారెడ్డిపై తొలిసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఆయనపై పోరుకు ‘సై’రన్ మోగించారు. ‘ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, సంగారెడ్డి నుంచి పోటీచేస్తా’నని పద్మినీరెడ్డి ప్రకటించడం.. ‘సంగారెడ్డి నాదే.. ఈ సారి ఎన్నికల్లో తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ప్రజా వేదికలపై ప్రజలను కోరటంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పోరుకు తెరలేచింది.
డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మిని మొదటి నుంచి సంగారెడ్డి మీద దృష్టి పెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా ఆమె ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సంగారెడ్డి అసెంబ్లీ నుంచి తానే పోటీ చేస్తానని, టికెట్ కూడా తనకే వస్తుందనే సంకేతాలు నియోజకవర్గ ప్రజలకు పంపుతూ వచ్చారు. విషయాన్ని మొదట్లోనే జగ్గారెడ్డి పసిగట్టినప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఆమె రాజకీయాల్లోకి రావడం తన భర్త దామోదర రాజనర్సింహకు అసలు ఇష్టం లేదనే భావనతో జగ్గారెడ్డి ఉన్నారు. పైగా సిట్టింగు ఎమ్మెల్యేను ఎవరు కదిలిస్తారు అనే ధీమాతో ఉన్నారు. తాజాగా ఆమె ఇకపై తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ప్రజలు కోరితే సంగారెడ్డి నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతటితో ఆగకుండా సొంత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ... ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలు ఆక్రమిస్తామని జగ్గారెడ్డి మాట్లాడటం అప్రజాస్వామికమని ఆయనపై ఎన్నికల కమిషన్‌కు, రాహుల్ గాంధీకి, గవర్నర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో జిల్లాలో రాజకీయంగా కలకలం రేగింది.
జగ్గారెడ్డి నోటి దురుసుతో చేసే వ్యాఖ్యలకు విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా అధిష్టానం వద్ద అయన్ను తక్కువ చేసి చూపించడంతోపాటు, న్యాయపరంగా ఆయన్ను ఇబ్బంది పెట్టి తద్వారా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే పథకంలో భాగంగానే ఆమె పావులు కదుపుతున్నట్లు సమాచారం. జిల్లా రాజకీయంగా బలమైన వర్గాన్ని తయారుచేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తొలుత తన భార్యను తెరమీదకు తీసుకొచ్చారని, తన భార్య జగ్గారెడ్డి సామాజిక వర్గానికే చెందిన మహిళ కాబట్టి ఆమెను నిలబెట్టి ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా పద్మినీరెడ్డి మాటలను జగ్గారెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన అతి కష్టం మీద ‘సాక్షి’తో మాట్లాడారు. అవసరం వచ్చిన రోజు ఆటంబాంబు వేస్తానని, మోఖా కోసం ఎదురుచూస్తున్నాని కుండబద్దలు కొట్టారు. ఆ రోజున వీళ్లంతా ముఖం ఎక్కడ పెట్టుకుంటారో చూస్తానని పరోక్షంగా పద్మినీరాజనర్సింహను ఉద్దేశించి అన్నారు. తనను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని, ఏమైనా తగ్గితే పోలింగ్ కేంద్రాలు ఆక్రమించి ఓట్లు పట్టుకురావాలని కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మీటింగ్‌లోనే చెప్పానని అన్నారు. తనకు రెండు మాటలు చెప్పే అలవాటు లేదన్నారు.
కార్యకర్తల్లో వేడి పుట్టించడానికి అలా మాట్లాడానన్నారు. 2006లో ఇప్పుడున్న నేతలే తనను హౌస్ అరెస్టు చేయించినా.. ప్రజలే ముందుకొచ్చి గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కోట్లాది రూపాయలు తెచ్చి సంగారెడ్డిని అభివృద్ధి చేశానని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల క్షేమం కోరే ఉంటుందన్నారు.