
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి విజయవాడకు టిక్కెట్టు రూ.2,500లు. ఆశ్చర్యపోకండి... ఇది విమాన చార్జీ కాదు.. బస్సు టిక్కెట్టే. ఇంకా సంక్రాంతి సందడి మొదలు కాకముందే ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో టిక్కెట్టు చార్జీలు అధికంగా పెంచేవారు. ఇప్పుడలా కాదు.. పండగ, పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వీటి రేట్లు పెంచేస్తున్నారు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. సెలవులకు విజయవాడ, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించాలంటే అప్పటికప్పుడు బెర్తులు దొరికే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ ‘క్యాష్’ చేసుకుంటున్నారు. వీరి దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
డిమాండ్‌ను బట్టి దోపిడీ
ప్రస్తుతం విశాఖ – విజయవాడ (349 కి.మీల దూరం) ప్రైవేటు ఏసీ బస్సు టిక్కెట్ ధర రూ.2,500కు పైగానే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి సీజను ప్రారంభం కావడానికి కనీసం రెండు వారాల సమయం ఉంది. పండగ వేళ దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఇప్పటికే చుక్కలనంటే చార్జీలను ఫిక్స్ చేసేశారు. కానీ ప్రస్తుతం అంతగా డిమాండ్ లేని ఈ రోజుల్లోనూ అదే బాదుడు కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నాలుగో శనివారం, ఆదివారం సెలవులు రావడం, మధ్యలో సోమవారం పనిదినం ఉన్నా మంగళవారం క్రిస్మస్ కావడంతో వరుస సెలవులు వచ్చినట్టయింది. దీన్ని ఆసరాగా చేసుకుని అసలు చార్జీకి రెట్టింపుకంటే అదనంగా వసూలు చేస్తున్నారు.
ఉదాహరణకు మంగళవారం ప్రైవేటు ట్రావెల్స్ విశాఖ – విజయవాడల మధ్య చార్జీలను పరిశీలిస్తే... కృష్ణా ట్రావెల్స్ సెమీ స్లీపర్ రూ.1,330, ఏసీ స్లీపర్ రూ.1,790, ఆరంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ స్లీపర్ రూ.2,400, ఎస్వీఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ నాన్ ఏసీ సెమీ స్లీపర్ రూ.890 చొప్పున నిర్ణయించారు. అంతేకాదు.. బస్సులు బయలుదేరే సమయానికి వీటి ధరలను అమాంతంగా పెంచేస్తున్నారు. ఒకవేళ ముగ్గురు ప్రయాణికులు ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకుని ఆఖరి క్షణంలో ఒకరి టిక్కెట్టు రద్దు చేయమని కోరితే మిగిలిన ఇద్దరివీ కేన్సిల్ చేస్తున్నారు. ఇలా రద్దయిన టిక్కెట్లను డిమాండ్‌ను బట్టి రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ముందుగా బుక్ చేసుకున్న టిక్కెట్టు కావాలంటే అప్పటికి పెంచిన చార్జిని ఇవ్వాలని లేదంటే టిక్కెట్టు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో ఉన్న వారు మరో గత్యంతరం లేక ఆఖరి నిమిషంలో అధిక చార్జీలు చెల్లించి గమ్యానికి చేరుకుంటున్నారు. ఇలా ప్రైవేటు ఆపరేటర్ల మోసాలపై రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు.
ఆర్టీసీది మరో తీరు
ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు బస్సులతో పోల్చుకుంటే ఆర్టీసీ వేగం ఒకింత తక్కువ. దానికితోడు అంతగా కండిషన్ లేని బస్సులు, నిర్లక్ష్యంగా నడిపే కొంతమంది డ్రైవర్ల వల్ల ఆర్టీసీ బస్సులు సకాలంలో గమ్యాన్ని చేరడం లేదు. ఇది దూరప్రాంత సర్వీసుల్లో ప్రయాణించి విధులకు హాజరయ్యే వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో అయిష్టంగానైనా ప్రైవేటు సర్వీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు ఈ నెల 23న విజయవాడ నుంచి విశాఖకు సూపర్ లగ్జరీ సర్వీసులో తండ్రీ కొడుకులు బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో ఎక్కిన వీరు రాత్రి 11 గంటలకల్లా విశాఖ చేరుకోవాలి. కానీ మార్గమధ్యలో టీలు, టిఫిన్లు, భోజనాలు పేరిట ఆపుకుంటూ నిర్ణీత సమయానికి మూడు గంటలు ఆలస్యంగా... అంటే రాత్రి 2 గంటలకు విశాఖ చేర్చారు. వాస్తవానికి ఆ రోజు దారిలో ట్రాఫిక్ జామ్‌లు కానీ, టోల్‌గేట్ల వద్ద రద్దీ కానీ లేదు. దీనిపై డ్రైవర్‌ను నిలదీస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ ప్రయాణికుడు సంబంధిత డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆర్టీసీ కూడా పండగ వేళల్లో ఫ్లెక్సీ ఫేర్‌ల పేరిట టిక్కెట్టుపై 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇలా ఇటు ప్రైవేటు, అటు ఆర్టీసీ యాజమాన్యాలు వీలు చిక్కినప్పుడల్లా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి.
అధికంగా వసూలు చేస్తే కేసులు
ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు అధికంగా బస్సు చార్జీలు వసూలు చేయడం నేరం. అలా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు మాకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి వాటిపై ప్రజల్లో చైతన్యం రావాలి.– వెంకటేశ్వరరావు,డిప్యూటీ ట్రాన్స్‌పోర్టుకమిషనర్
ఆలస్యంగాచేరిస్తే చర్యలు
ప్రయాణికులను గమ్యానికి ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేరిస్తే సంబంధిత డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటాం. భోజనం, అల్పాహారాల కోసం నిర్ణీత ప్రదేశాల్లోనే ఆపాలి. బస్సు కదలికలను ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గమనిస్తుంటాం. బస్సు గమ్యానికి చేర్చడం ఆలస్యమైతే వివరణ కోరతాం. పొరపాటు ఉంటే రూ.4 వేల వరకు జరిమానా విధిస్తాం. అసౌకర్యం కలిగితే ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు.
– వెంకట్రావు,డిప్యూటీ సీటీఎం, అర్బన్
Comments
Please login to add a commentAdd a comment