
నిఘా నీడలో షార్
సూళ్లూరుపేట: నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా షార్ పరిసర ప్రాంతాలు మొత్తం నిఘా నీడలో ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా స్పందించేలా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ పహారా కాస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు షార్‌కు చేరుకుంటారు.
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, నిర్మల సీతారామన్‌తో పాటు పలువురు ప్రముఖులు షార్‌కు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు అధికారులతో పాటు ప్రధాన మంత్రి ప్రత్యేక భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కలెక్టర్ శ్రీకాంత్. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ షార్‌లోనే ఉండి భద్రతా ఏర్పాట్లును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 300 మంది పోలీస్ అధికారులు 2700 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎస్పీజీ ఐజీ చతుర్వేది, అసిస్టెంట్ ఐజీలు ధనుష్‌సింగ్, సుమిత్రారాయ్ ఆధ్వర్యంలో 30 మంది ఎస్‌పీజీ కమెండోలు షార్‌లో భద్రతను సమీక్షిస్తున్నారు. ప్రధాని బసచేయనున్న భాస్కర్ గెస్ట్‌హాస్‌ను ఎస్పీ కమెండోలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
గగనతలంలో గస్తీ
ప్రధానమంత్రి చెన్నై విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో షార్‌కు వస్తారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు గగనతలంలో హెలికాఫ్టర్‌లతో గస్తీ కాస్తున్నారు. షార్ పరిసరాలను కూడా నిశితంగా గమనిస్తున్నారు. శనివారం రెండు హెలికాఫ్టర్లతో చెన్నై నుంచి షార్ వరకు రిహార్సల్ నిర్వహించారు. పోలీసులు షార్‌లోని హెలీపాడ్ నుంచి భాస్కర్‌గెస్ట్‌హాస్ వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ జరిపారు.
మరోవైపు డాగ్‌స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది షార్ పరిసరాలను అనువణువూ జల్లెడపడుతున్నారు. సాధారణంగా షార్‌లో భద్రతను పర్యవేక్షించే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల (సీఐఎస్‌ఎఫ్) సిబ్బంది సుమారు 730 మంది పహారాకాస్తున్నారు. సీఐఎస్‌ఎప్ కమాండెంట్ సుభాష్ సిన్హా ఆధ్వర్యంలో షార్ చుట్టూ మోహరించారు. బంగాళాఖాతంలో మెరైన్ దళాలతో పాటు నౌకయాన సిబ్బంది బోట్లలో గస్తీ తిరుగుతున్నారు. వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో ప్రయోగానికి మూడు రోజుల ముందు నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు.