అష్ట దిగ్బంధం | Tight security takeing of municipal elections | Sakshi
Sakshi News home page

అష్ట దిగ్బంధం

Published Sun, Mar 9 2014 3:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM

Tight security takeing of municipal elections

సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్, జెడ్పీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణను పోలీసు ఉన్నతాధికారులు సవాల్‌గా తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ), స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్వోజీ) ద్వారా జిల్లాను జల్లెడ పడుతోన్న పోలీసు ఉన్నతాధికారులు.. రౌడీషీటర్లు, సంఘ విద్రోహక శక్తులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎన్నికల్లో ఇబ్బందులు సృష్టిస్తారని భావించిన వారిని బైండోవర్ చేస్తున్నారు. 3,800 పోలీసు సిబ్బందితోపాటు నాలుగు కంపెనీ(నాలుగు వేల మంది)ల బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలను జిల్లాలో ఇప్పటికే మోహరించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నాటికి మరో ఐదు వేల మంది సాయుధ పోలీసులను జిల్లాకు పంపాలని డీజీపీ ప్రసాదరావుకు ఎస్పీ సెంథిల్‌కుమార్ లేఖ రాశారు.
 
 ఆ బలగాలను సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలోనే ఉంచాలని కోరారు. వివరాల్లోకి వెళితే.. సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం షెడ్యూలు విడుదల చేసిన విషయం విదితమే. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. తాజాగా సుప్రీంకోర్టు కన్నెర్ర చేయడంతో ఆదివారం గానీ.. సోమవారం గానీ మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలును విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు రానే వచ్చింది.
 
 కొద్ది రోజుల తేడాలోనే మూడు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూలు విడుదల కావడం.. వాటిని నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడం పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా. అలాంటి వాతావరణం కల్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు నడుం బిగించారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో 2013 జూలైలో జిల్లాకు నాలుగు కంపెనీల బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్ బలగాలు వచ్చిన విషయం విదితమే.
 
 జిల్లా పోలీసు శాఖలో 3,800 మంది పనిచేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం 7,800 మంది సాయుధ పోలీసులను జిల్లాలో మోహరించారన్న మాట. ఎస్పీ సెంథిల్‌కుమార్ నేతృత్వంలోని స్పెషల్ బ్రాంచ్, ఎస్వోజీ విభాగం జిల్లాను వడబోస్తోంది. రౌడీషీటర్లు, నేరచరితులను గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశిస్తున్నారు. ఆ ఆదేశాలను కొందరు సీఐలు వక్రీకరించి.. ఎలాంటి నేరచరిత్ర లేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. కౌన్సిలింగ్ ద్వారా సంఘ విద్రోహక శక్తులకు గుణపాఠం చెప్పిన పోలీసులు.. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు.
 
 అడుగడుగునా చెక్‌పోస్టులే..
 ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, అక్రమాయుధాలకు అడ్డుకట్ట వేయడానికి జిల్లాలో అడుగడుగునా పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అనంతపురం నగరంతోపాటు 11 మున్సిపాల్టీల పరిధిలో 63 చెక్‌పోస్టులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో చేసిన తనిఖీల్లో ఇప్పటికే రూ.2.70 కోట్ల డబ్బును పట్టుకుని.. ఆదాయపు పన్ను శాఖకు స్వాధీనం చేశారు. భారీ ఎత్తున మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదే చెక్‌పోస్టుల ద్వారా ఎర్రచందనం దుంగలను కూడా పట్టుకున్నారు. కర్ణాటకలోని తుమకూరు, బళ్లారి తదితర జిల్లాలతో మన జిల్లాకు సరిహద్దు ఉంది. కర్ణాటక ప్రాంతం నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం, డబ్బు జిల్లాలోకి వివిధ రాజకీయ పార్టీల నేతలు తెస్తున్నారు.
 
 కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీ ఎత్తున నకిలీ మద్యం, డబ్బు జిల్లాకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు నడుంబిగించారు. జిల్లా సరిహద్దుల్లో 48 ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటుచేయాలని.. వాటిలో పూర్తిగా బీఎస్‌ఎఫ్ జవాన్లనే నియమించాలని నిర్ణయించారు. తనిఖీలను ముమ్మరం చేయడం ద్వారా డబ్బు, మద్యం ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చునని భావిస్తున్నారు.  
 
 పోలింగ్ కేంద్రాలపై డేగకన్ను..
 జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను 750.. మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలను 2,560.. సార్వత్రిక ఎన్నికలను 3,310 పోలింగ్ కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆ పోలింగ్ కేంద్రాలను నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. సాధారణ, సమస్యాత్మక, సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా వర్గీకరించారు. అందుకు సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘం పరిశీలనకు పంపారు. ఎన్నికల సంఘం ఆమోదించిన తర్వాత ఆ కేంద్రాల్లో పోలింగ్ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement