కూలుతున్న బండరాళ్లు.. పట్టించుకోని టీటీడీ అధికారులు
నిపుణుల హెచ్చరికలను గాలికి వదిలిన వైనం
భయపడుతున్న ప్రయాణికులు
తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డు ప్రయాణం యాత్రికులను భయపెడుతోంది. పెద్దపెద్ద బండరాళ్లు పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రక్షణ చర్యలు చేపట్టాలని నిపుణులు ముందస్తుగా హెచ్చరించినా టీటీడీ ఇంజినీర్ల చెవికి ఎక్కలేదు. ఫలితంగా కొండచరియలు విరిగి పడుతున్నాయి.
రెండో ఘాట్‌లో ప్రమాద సంకేతాలు..
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో తరచూ బండరాళ్లు కూలుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర తర్వాత నుంచి తిరుమలకు చేరే వరకు కొండ చరియలు విరి గిపడే అవకాశాలు ఉన్నా యి. చివరి ఐదు మలుపుల (హెయిర్‌పిన్ కర్వ్స్) వద్ద ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మోస్తరు వర్షం కురుస్తుండడంతో భారీ స్థాయిలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. దశాబ్దం క్రితం త్రోవ భాష్యకార్ల సన్నిధి సమీపంలోని మలుపు వద్ద భారీగా కొండ చరియలు విరిగిపడటంతో అప్పట్లో ప్రత్యేకంగా ఇంజినీరింగ్ నిపుణులను రప్పించి తొలగించారు. అక్కడే భారీ ఇనుపరాడ్లను కొండ బొరియల్లోకి దించారు. ప్రత్యేకంగా ఇనుప కంచె (ఫెన్సింగ్) నిర్మించారు. చివరి మలుపు వద్ద రెండేళ్ల క్రితం రాక్‌బౌల్టర్ ట్రాప్ (ఇనుప కంచె) నిర్మించారు. తద్వారా బండరాళ్లు దొర్లినా ఇనుప కంచెలో పడుతుండటంతో ప్రమాదాలు తప్పుతున్నాయి. ఎనిమిదో కిలోమీటర్ వద్ద గత ఏడాది డిసెంబరు 17వ తేదీన భారీ స్థాయిలో కొండరాళ్లు కూలాయి. తాజాగా దానికి వందమీటర్ల దూరంలోనే భారీ కొండచరియ కూలింది.
హెచ్చరిక లు పట్టని ఉన్నతాధికారులు
తిరుమల రెండో ఘాట్‌లో కొండ చరియలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని గత ఏడాది 20వ తేదీన ఐఐటీ ప్రొఫెసర్ నరసింహారావు టీటీడీని హెచ్చరించారు . ప్రమాద సంకేతాలు చూపే ప్రాంతాల్లోని బండరాళ్లను వెంటనే తొలగించాలని ఆయన సూచించారు. అధికారులు పట్టించుకోకపోగా కోట్లు ఖర్చుపెట్టి కొండలను కూల్చాల్సిన అవసరం ఏముందని కొట్టిపారేశారు. బండరాళ్లు కూలిన సందర్భాల్లో హడావుడి చేసి తర్వాత గాలికి వదిలేస్తున్నారు.
నైరాశ్యంలో ఇంజినీరింగ్ విభాగం
ఏడాది కాలంగా ఇంజినీరింగ్ శాఖలో నిర్లిప్తత చోటు చేసుకుంది. అవసరమైన పనుల అనుమతి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంతో ముడిపడిన పనులు తప్పిస్తే మిగిలిన వాటికి అనుమతుల రావడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఇటు ఇంజినీర్లలో, అటు కాంట్రాక్టర్లలో నైరాశ్యం ఆవహించిందని ప్రచారం సాగుతోంది.
యాత్రికుల గుండెల్లో రాయి
Published Fri, Aug 21 2015 1:46 AM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement