అదిగో చిరుత!
తిరుమలలో చిరుతల భయం ఒకటి కాదు.. జట్లుగా సంచారం
టీటీడీ, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాల నిర్లక్ష్య తీరుపై విమర్శలు
భక్తులు, స్థానికుల్లో పెరిగిన ఆందోళన
ఒకటికాదు.. ఏకంగా జట్లుగా ఏర్పడ్డాయి. అవి నిత్యం శివారు ప్రాంతాల్లో తిరుగుతూ జనం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు, స్థానికులు హడలిపోతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన టీటీడీ ఫారెస్ట్, ప్రభుత్వ వైల్డ్‌లైఫ్విభాగాలు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
తిరుమల : తిరుమల కొండమీద చిరుతల సం తతి పెరిగింది. ఇవి శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా సంచరిస్తూ.. స్థానికులు, భక్తులను బెంబేలెత్తిస్తున్నాయి. తూర్పున కడప జిల్లా నుంచి పశ్చిమాన తలకోన వరకు విస్తరించిన శేషాచల అడవుల పరిధిలో దాదాపు 50కిపైగా చిరుతలు సంచరిస్తున్నట్టు అనధికారిక సమచారం. 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించిన శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలో సుమా రు 10, మామండూరు రేంజ్ పరిధిలో మరో 6 వరకు సంచరిస్తున్నాయి.
రెండు జట్లుగా నాలుగు చిరుతల సంచారం
తిరుమలలో నాలుగు చిరుత పులులు సంచరిస్తున్నాయి. గతంలో ఒంటరిగానే తిరిగేవి. ప్రస్తుతం అవి రెండేసి చొప్పున జట్టుగా తిరుగుతున్నాయి. వీటిలో రెండు చిరుతలు గోగర్భం మఠాల నుంచి రింగ్ రోడ్డు, గ్యాస్ గోడౌన్ మీదుగా.. స్థాని కులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పు ప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి. అదును చూసుకుని టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీటైపు, డీటైపు క్వార్టర్ల వరకు తిరుగుతున్నా యి. మరో రెండు చిరుతలు జింకల పార్కు నుంచి అవ్వాచ్చారి కోన, అలిపిరి కాలిబాట మార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్ రోడ్డు ద్వారా శ్రీవారి మెట్టు వరకు తిరుగుతున్నాయి.
చీకటిపడితే భయం
ఈ నెల మొదటి వారం నుంచి చిరుతల సంచారం పెరిగింది. తరచూ ఇవి ఏదో ఒక చోట జనం కంట కనబడుతున్నాయి. వాటిని తమ సెల్‌ఫోన్లలో బందిస్తూ ఆ సమాచారాన్ని ఎప్పడికప్పుడు సామాజిక మాధ్యమాల్లో బదిలీ చేస్తున్నారు. ఎప్పు డు ఏ మార్గంలో చిరుత వస్తుందోనని భక్తులతోపాటు స్థానికుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఆలయంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేసే టీటీడీ ఉద్యోగులు, కార్మికులతో పాటు దుకాణదారులు నివాస ప్రాంతాలకు 24 గంటలు వెళ్లివస్తుంటారు. చిరుతల సంచారంతో వారు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లకు ముందు అలిపిరి కాలిబాటలో సంచరించే రెండు చిరుతల్ని బోన్లు ఏర్పాటు చేసి బంధించిన తరహాలోనే, ప్రస్తుతం సంచరించే వాటిని కూడా పట్టుకోవాలి. అనుకోని ఘటన జరిగితే దాని ఫలితంగా టీటీడీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
సంతాన ఉత్పత్తికోసమే..
సాధారణంగా చిరుతలు ఒంటరిగానే వేట సాగిస్తాయి. అవి కేవలం సంతాన ఉత్పత్తి (హీట్)కు వ చ్చిన సందర్భంలో జట్లుగా కలసికట్టుగా తిరుగుతుం టాయి. ఆ సమయంలో వాటి ఆలోచన కేవలం సంతాన ఉత్పత్తి తప్ప మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ చిరుతలు కని పిస్తే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
చర్యలు వేగవంతం చేస్తాం
చిరుతల వల్ల ఎలాంటి భయం లేదు. అవి మనుషుల మీద దాడి చేసే స్వభావం చాలా తక్కువ. వాటికి మనుషులను చూస్తేనే భయం ఎక్కువ. అయినప్పటికీ చిరుతల సంచారంతో వాటి పాద ముద్రలు సేకరిస్తాం. వాటి కట్టడి చర్యలు తీవ్రతరం చేస్తాం. దీనిపై భక్తులు, స్థానికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- శివరామ్‌ప్రసాద్, టీటీడీ డీఎఫ్‌వో