
తిరుమల/అన్నవరం(ప్రత్తిపాడు)/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఈనెల 17వ తేదీన చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు మూసివేయనున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 5 వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం తలుపులు మూసివేస్తారు. 17న బుధవారం ఉదయాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 16న దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశారు.
సత్యదేవుని ఆలయం..
చంద్రగ్రహణం కారణంగా అన్నవరంలోని సత్యదేవుని ఆలయాన్ని సాయంత్రం నాలుగు గంటలకు మూసివేయనున్నట్లు ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలతోపాటు వ్రతాలు, ఇతర పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారంతో శాకంబరిదేవి ఉత్సవాలు ముగియనున్నాయి. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉప ఆలయాలు మూసివేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment