తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు.
తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment