మంచుతెరల్లో మహిమాన్వితుడు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి కోసం ముస్తాబయ్యే తిరుమల పరిసరాలను చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. సుగంధభరిత పుష్పాలు, విద్యుద్దీపాలతో ఇలవైకుంఠాన్ని తలపించే ఆ పరిసరాలకు ఆదివారం తెల్లవారుజామున ప్రకృతి మంచు తెరలతో మరిన్ని వన్నెలద్దింది. దీంతో ఆ మంచు తెరల్లోనుంచి దేదీప్యమానంగా వెలుగుతున్న శ్రీవారి ఆలయం భక్తులను ఆనందపారవ శ్యంలో ఓలలాడించింది. శ్రీవారి పుష్కరిణి సైతం కొత్త శోభను సంతరించుకుంది. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణి వద్దకు వచ్చిన భక్తులు మహదానందంతో పుణ్యస్నానాలు ఆచరించారు.
-సాక్షి, తిరుమల