శ్రీవారి దర్శనాల్లో సిఫారసులు రద్దు
* కోడ్, రాష్ట్రపతి పాలన వల్లే: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: రాష్ర్టంలో రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో వీఐపీల సిఫారసులు రద్దు చేశామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ గురువారమిక్కడ తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలికీ ఇదే నిర్ణ యం వర్తిస్తుందన్నారు. దర్శన టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
అధికారుల నిర్ణయాన్ని గౌరవిస్తామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. అయినా ఈ విషయాన్ని సహచర సభ్యులతో కలసి చర్చిస్తామని తెలిపారు. సిఫారసు దర్శనాల రద్దు వల్ల గంట సమయం ఆదా అవుతుందని, ఆ సమయాన్ని రూ.300 టికెట్ల భక్తులకు కేటాయిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. శుక్రవారం నుంచి ఎలాంటి సిఫారసు దర్శనాలు కేటాయించబోమన్నారు.
ఎన్నికల కోడ్‌తో ఆగిన శ్రీనివాస కల్యాణోత్సవాలు
ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు(తిరుమల తప్ప మిగతాచోట) నిర్వహిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కల్యాణోత్సవాన్ని నిర్వహించింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లోనూ కల్యాణోత్సవాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.
కాగా దేశవ్యాప్తం గా ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. శ్రీవారి పేరుతో కల్యాణాలు జరిపి ఓటర్లను ఆకర్షించే అవకాశ ముందని భావించిన ఈసీ వీటిని నిర్వహించరాదని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ముగిసేదాకా కల్యాణోత్సవా లు నిర్వహించరాదని టీటీడీ అధికారులు నిర్ణయించారు.