Kanumuri Bapi Raju
-
క్షత్రియ పుత్రులకే పట్టం
సాక్షి, ఏలూరు : జిల్లాలో నరసాపురం లోక్‌సభస్థానంలో గెలుపు ఓ మిస్టరీ. ఈ నియోజకవర్గం క్షత్రియులకు పెట్టని కోట. ఇప్పటివరకూ 15సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మినహా 13 సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే విజయబావుటా ఎగురవేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో జనాభా, ఓటర్ల పరంగా ఆ సామాజికవర్గం తక్కువే. అయినా ఆధిపత్యం మాత్రం వారిదే. భూపతిరాజు విజయకుమార్ రాజు, డి.బలరామరాజు, అల్లూరి సుభాష్ చంద్రబోస్, కనుమూరి బాపిరాజు, ప్రముఖ సినీనటుడు యూవీ కృష్ణం రాజు, ఉద్దరాజు రామం, ఎంటీ రాజు, గోకరాజు గంగరాజు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి తమ హవాను చాటారు. -
‘రాజు’గారూ..! మీ సేవలు ఇక చాలు!
సాక్షి, తిరుమల: ‘‘నాకు నేనుగా రాజీనామా చేయను?’’ అని టీటీడీ చైర్మన్ పదవిని అంటిపెట్టుకున్న కనుమూరి బాపిరాజుకు సోమవారం గట్టి ఎదురు దెబ్బతగిలింది. ‘మీ సేవలు ఇక చాలు’ అంటూ టీటీడీ బోర్డును రద్దు చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం దేవస్థానం బోర్డు సెల్ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయి కంటే ఎక్కువ హోదా కలిగిన టీటీడీ చైర్మన్ పదవిలో ఢిల్లీ పెద్దల అండదండలు, తన రాజకీయ పలుకుబడితో కనుమూరి బాపిరాజు ఏకధాటిగా మూడేళ్లపాటు కొనసాగారు. ప్రభుత్వం మారినా పదవిని మాత్రం వదులుకునేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈయన హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరిగింది అంతంతమాత్రమే. అభివృద్ధి కార్యక్రమాల మాట ఎటున్నా విమర్శలు మాత్రం మూటకట్టుకున్నారు. అధికారాన్ని తన కుటుంబీకులకు పంచారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకంటే తన కుటుంబీకులే మహద్వారం గుండా మందీమార్బలంతో ప్రవేశిస్తూ అయినవారికి యథేచ్ఛగా దర్శనాలు చేయించటంలో బిజీగా గడిపారన్న విమర్శలున్నాయి. రోజుకు కనీసం రూ.40 వేలు అద్దె వచ్చే అధునాత వసతులతో తొమ్మిది గదులున్న అతిథిగృహాన్ని పూర్తిగా మూడేళ్లపాటు తన ఆధీనంలో ఉంచుకుని శ్రీవారి ఖజానాకు భారీగా గండికొట్టారన్న ఆరోపణలు మూటకట్టుకున్నారు. చైర్మన్ హోదాలో ఉన్న బాపిరాజు కేంద్ర మంత్రి నుంచి గుమాస్తా వరకూ, కార్పొరేట్ దిగ్గజం నుంచి చిల్లర వర్తకుడి స్థాయి వరకు అవసరమనుకున్న వారందరికీ తానే సాగిలపడుతూ దగ్గరుండి దర్శనాలు చేయించారన్న అపవాదు మిగుల్చుకున్నారు. తిరుమలలోని చైర్మన్క్యాంపు కార్యాలయాన్ని గంపగుత్తగా తన వారికి అప్పగించి చోద్యం చూశారన్న విమర్శలు కూడా బాహాటంగానే ఎదురవటం గమనార్హం. ఇక పార్లమెంట్ సభ్యుడిగా సీమాంధ్ర నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆయన విభజన ఉద్యమానికి ఏ మాత్రం ఎదురుతిరిగి మాట్లాడకపోవడంపై ప్రజలు తీవ్ర నినసనలు వ్యక్తం చేసినా బాపిరాజు పట్టించుకోలేదు. విభజన మంటపెట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఆఖరకు ప్రభుత్వం మారినా తన పదవిని వదులుకునేందుకు సిద్ధపడకపోగా మరోసారి కొనసాగేందుకు తన బంధుగణంతో కాళ్లబేరానికి దిగినట్టు ప్రచారం సాగింది. ఈనెల ఒకటవ తేదీన కేబినెట్ తీర్మానంలో టీటీడీ బోర్డును కూడా రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా నవ్విపోదురుకాని.. నాకేమిటన్నట్టు దేవస్థానం పదవి కాలాన్ని ఒక్క సెకను కూడా వదులుకోబోనని మీడియా సమావేశంపెట్టి మరీ తెగేసి చెప్పేశారు. ఆయన పదవీ కాలం మరో 13 రోజులు ఉండగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ ఉత్తర్వులు ఇచ్చి రాజుగారి సేవలకు సెలవు ప్రకటించింది. చైర్మన్ కార్యాలయం ఖాళీ.. భక్తులకు గదుల కేటాయింపు మూడేళ్లుగా తన సొంత కార్యాలయానికి వాడుకున్న 9 గదులున్న పద్మావతి నిలయం అతిథిగృహాన్ని సోమవారం నుంచి భక్తులకు కేటాయించారు. ఇక్కడున్న చైర్మన్ కార్యాలయాన్ని రిసెప్షన్ అధికారులు సోమవారం ఖాళీ చేయించారు. -
వదలా.. నేనొదలా!
*టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా వెనక్కి తగ్గని బాపిరాజు *కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యే దాకా.. లేదా పదవీకాలం పూర్తయ్యే వరకూ పదవిని వదలనని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా చైర్మన్ పదవిని వదిలేది లేదని కనుమూరి బాపిరాజు భీష్మించుకు కూర్చున్నారు. పదవీకాలం పూర్తయ్యే వరకూ గానీ.. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యే దాకా పదవికి రాజీనామా చేయబోనని శుక్రవారం తేల్చి చెప్పారు. పాలకమండళ్లను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడుతాయని అధికారవర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో బాపిరాజు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజుకు ఆగస్టు 24, 2011న అనుహ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. అధినేత్రి సోనియాగాంధీకి వీరవిధేయుడు కావడంతో రాయపాటి సాంబశివరావును కాదని.. కనూమూరి బాపిరాజునే టీటీడీ చైర్మన్ పదవి వరించింది. ఇంతలోనే రాష్ట్రంలో విభజనోద్యమం తీవ్రరూపం దాల్చింది. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఆ పార్టీ నేతలే విమర్శల వర్షం కురిపిస్తోన్న నేపథ్యంలో బాపిరాజు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతూ వచ్చారు. దాంతో టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీకాలం పూర్తికాక మునుపే ఆగస్టు 25, 2012న మరో రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగేలా అప్పటి కిరణ్ సర్కారును ఉత్తర్వులు జారీ చేసేలా కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు అప్పటి కిరణ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కనుమూరి బాపిరాజు పదవీకాలం ఆగస్టు 24తో పూర్తి కానుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిన కనుమూరి ఆ పనిచేయలేదు. పైగా తన పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగించేలా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబునే కోరారు. ఆ మేరకు చంద్రబాబుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా ఒత్తిడి తెచ్చారు. కానీ టీటీడీ సహా రాష్ట్రంలో అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ ఈనెల 1న మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆమేరకు సోమవారం ఆర్డినెన్స్ జారీ అయ్యే అకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్న కనుమూరి గురువారం తిరుమలకు వచ్చారు. టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయడానికే కనుమూరి తిరుమలకు వచ్చారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేశారు. తిరుమలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి తనకు తానుగా రాజీనామా చేయనని సెలవిచ్చారు. పదవీకాలం పూర్తయ్యే వరకు గానీ.. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు గానీ పదవిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా సోమవారం ఆర్డినెన్స్ జారీ కాబోతున్నా కనుమూరి పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. పదవీకాలం పూర్తయ్యే వరకు ఒక్కక్షణం కూడా అధికారాన్ని వదులుకునేది లేదని ఆయన చెప్పకనే చెప్పారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
కనుమూరి కల చెదిరింది
టీటీడీతోపాటు అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దుచేసిన మంత్రివర్గం తిరుపతి: పదవీకాలం పూర్తయ్యేదాకా టీటీడీ చైర్మన్‌గా కొనసాగాలన్న బాపిరాజు కలలు కల్లలయ్యాయి. టీటీడీ సహా అన్ని ఆలయాల పాలక మండళ్లను రద్దుచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో బాపిరాజు డీలాపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 25, 2012న అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజుకు అనుహ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు తక్షణమే పదవుల నుంచి వైదొలగాలని.. లేదంటే బలవంతంగా తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. తన పదవీకాలం ఆగస్టు 24తో పూర్తవుతుందని.. అప్పటిదాకా పదవిలో కొనసాగించాలని చంద్రబాబును కనుమూరి కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా బాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వెంకయ్య దన్నుతో పదవీకాలం పూర్తయ్యేవరకూ టీటీడీ చైర్మన్‌గా తానే కొనసాగుతానని కనుమూరి అనుయాయుల వద్ద ధీమా వ్యక్తం చేశారు. కానీ.. ఆయన అంచనాలు తలకిందులయ్యా యి. టీటీడీ సహా అన్ని ఆలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. కనుమూరి 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు.. 2012, ఆగస్టు 25 నుంచి 23 నెలలపాటు టీటీడీ బోర్డు చైర్మన్‌గా పని చేశారు. అయితే అటు ఆలయాభివృద్ధికిగానీ, ఇటు భక్తులకు సౌకర్యాలను మెరుగుపర్చడంలోగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కేవలం పారిశ్రామికవేత్తలకూ, సినీనటులకూ, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషిస్తోన్న నేతలకు శ్రీవారి దర్శనాలు చేయించి, వారి మెప్పు పొందేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ప్రొటోకాల్ విషయంలో అప్ప టి ఈవో ఎల్వీ సుబ్రమణ్యంతో విభేదించారు. చివరకు టీటీడీ ఈవోగా ఎల్వీని తప్పించి ఎంజీ గోపాల్‌ను నియమించారు. ఎంజీ గోపాల్‌తోనూ కనుమూరి విభేదించడం గమనార్హం. -
మేల్‌ఛాట్ వస్త్రాలు భక్తులూ ఇవ్వొచ్చు
సాక్షి, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామిని కనులారా క్షణంపాటు దర్శించినా భక్తులు పరవశించిపోతుంటారు. ఆ స్వామికి తమ చేతులమీదుగా సమర్పించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని (మూలమూర్తికి 12 గజాల పొడవు రెండుగజాల వెడల్పు కలిగిన ధోవతి) అలంకరింప చేస్తే.. అలాంటి మధురానుభూతి పొందే అవకాశాన్ని తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి కల్పించింది. తిరుమల ఆలయంలో ప్రతి శుక్రవారం శ్రీవారికి బహూకరించే మేల్‌ఛాట్ వస్త్రాన్ని ఇకపై భక్తులు ఇస్తే స్వీకరించాలని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశం తీర్మానించింది. భారీగా మార్కెటింగ్ కొనుగోళ్లకు అవసరమైన అనుమతులకు ఆమోదం తెలిపింది. అలాగే, టీటీడీ మార్కెటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ నుంచి కేజీ రూ.42 చొప్పున ఆరునెలలకు సరిపడా రూ.12.85కోట్లతో బియ్యం కొనుగోలు చేయనున్నారు. రూ.9కోట్లతో 22లక్షల కిలోల బెంగాల్ దాల్(పప్పు), రూ.1.35 కోట్లతో 1.5 లక్షల కిలోల పెసరపప్పు, రూ.1.67 కోట్లతో 440 టన్నుల బెల్లం కొనుగోలు చేయనున్నారు. ముంబైలోని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎంఎంటీసీ) లిమిటెడ్ సంస్థ నుంచి 2 గ్రాములు, 5 గ్రాముల వెండి డాలర్లు 30 వేలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. శ్రీవారి భక్తులకు లడ్డూల కొరత లేకుండా చూసేందుకు ఆలయంలో ప్రధాన పోటులో 332మంది, అదనపు పోటులో 140మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని 2016వ సంవత్సరం వరకు కొనసాగించనున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్మెంట్లలో దర్శనం కోసం వేచి ఉండే భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించేలా రూ.2.70 కోట్లతో 108 అంగుళాల ప్లాస్మా టీవీలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. -
వేడుకగా ముగిసిన పద్మావతి పరిణయోత్సవం
తిరుమల: తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం శనివారం వేడుకగా ముగిసింది. మలయప్పస్వామి తొలిరోజు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనంపై ఊరేగగా, మూడో రోజైన శనివారం గరుడ వాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు దంతపల్లకిని అధిరోహించి ప్రదర్శనగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకున్నారు. శోభాయమానంగా రూపొందించిన పరిణయోత్సవంపై మూడు రోజుల పాటు స్వామివారు, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూల బంతాట, నూతన వస్రాల సమర్పణ చేశారు. తర్వాత ఉత్సవర్లకు ఆస్థానం, వేదాలు, పురాణాలు, సంగీత రాగాలు, కవితలు, నృత్యాలతో కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.కల్యాణవేదిక సమీపంలోనే రంగురంగుల బాణసంచా పేల్చుతూ స్వామికినీరాజనం పలికారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో పోలా భాస్కర్, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నామినేషన్ వేసిన బాపిరాజు
నరసాపురం అర్బన్, న్యూస్‌లైన్ : నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎంపీ, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో ఊరేగింపుగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి మధ్యాహ్నం 2.20 గంటలకు చేరుకున్న ఆయన ఒక సెట్టు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావు నాయుడుకు అందజేశారు. బాపిరాజు వెంట ఆయన సతీమణి అన్నపూర్ణ, డీసీసీ అధ్యక్షుడు వెంకటరత్నం ఉన్నారు. బాపిరాజు నరసాపురం నుంచి నాలుగోసారి పోటీ పడుతున్నారు. కోడ్ ఉల్లంఘించిన కేంద్ర మంత్రి శీలం, బాపిరాజు పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ సభ నిర్వహించి కేంద్రం మంత్రి జేడీ శీలం, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. బాపిరాజు నామినేషన్ దాఖలు చేసేందుకు శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి ఊరేగింపుగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి బయలు దేరారు. ఇదే సమయంలో స్థానిక కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి జేడీ శీలం పట్టణంలో రోడ్‌షో నిర్వహించి థామస్ బ్రిడ్జి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కేవలం రోడ్‌షో నిర్వహించడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనుమతి తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా సభ నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే సభను నిలిపివేయాలని సీఐ భాస్కరరావు కోరారు. కానీ వారు పట్టించుకోకుండానే సభ నిర్వహించారు. దీనిపై ఇంకా కేసు నమోదు కాలేదు. -
శ్రీవారి దర్శనాల్లో సిఫారసులు రద్దు
* కోడ్, రాష్ట్రపతి పాలన వల్లే: టీటీడీ ఈవో సాక్షి, తిరుమల: రాష్ర్టంలో రాష్ట్రపతి పాలన, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపుల్లో వీఐపీల సిఫారసులు రద్దు చేశామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ గురువారమిక్కడ తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలికీ ఇదే నిర్ణ యం వర్తిస్తుందన్నారు. దర్శన టికెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికారుల నిర్ణయాన్ని గౌరవిస్తామని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. అయినా ఈ విషయాన్ని సహచర సభ్యులతో కలసి చర్చిస్తామని తెలిపారు. సిఫారసు దర్శనాల రద్దు వల్ల గంట సమయం ఆదా అవుతుందని, ఆ సమయాన్ని రూ.300 టికెట్ల భక్తులకు కేటాయిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. శుక్రవారం నుంచి ఎలాంటి సిఫారసు దర్శనాలు కేటాయించబోమన్నారు. ఎన్నికల కోడ్‌తో ఆగిన శ్రీనివాస కల్యాణోత్సవాలు ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా శ్రీనివాస కల్యాణాలు(తిరుమల తప్ప మిగతాచోట) నిర్వహిస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కల్యాణోత్సవాన్ని నిర్వహించింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లోనూ కల్యాణోత్సవాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసి ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా దేశవ్యాప్తం గా ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. శ్రీవారి పేరుతో కల్యాణాలు జరిపి ఓటర్లను ఆకర్షించే అవకాశ ముందని భావించిన ఈసీ వీటిని నిర్వహించరాదని ఆదేశించింది. దీంతో ఎన్నికలు ముగిసేదాకా కల్యాణోత్సవా లు నిర్వహించరాదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు. ఆకట్టుకుంటున్న కళాకండాలు పురాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని తులాభారం, గజేంద్ర మోక్షం, హిరణ్యాక్షకుడనే రాక్షసు న్ని సంహరించి భూదేవిని కాపాడుతున్న శ్వేత వరాహస్వామి, మారువేషంలో వచ్చి సీతమ్మను భిక్షమడిగే రావణాసురుడు, మహిరావణుడనే రాక్షసున్ని సంహరించి రామలక్ష్మణులను భుజంపై తీసుకెళ్తున్న హనుమంతుడు వంటి సన్నివేశాలకు సంబంధించిన కళాకండాలు ఆకట్టుకుంటున్నాయి. పూలతో అలంకరించిన ఏనుగు బొమ్మ, కూరగాయలతో చేసిన కళాకృతులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. -
కాలినడక భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం: కనుమూరి బాపిరాజు
విజయవాడ, న్యూస్‌లైన్: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు ఒక లడ్డూ ప్రసాదం ఉచితంగా ఇచ్చేందుకు త్వరలో టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. విజయవాడలోని భక్తులు మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో తిరుమలలో నిత్యాన్నదానానికి ఉచితంగా కూరగాయలు పంపుతున్న వాహనాన్ని బుధవారం బాపిరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల వచ్చే భక్తులకు మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రోజూ 50 వేలమంది భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నామన్నారు. అన్న ప్రసాదానికి వినియోగించే బియ్యాన్ని రైస్ మిల్లర్ల సంఘాల నుంచి కొనుగోలు చేయడం వలన కోట్లాది రూపాయలు ఆదా కావడంతోపాటు, నాణ్యతా ప్రమాణాలు గల బియ్యాన్ని పొందగలుగుతున్నామని చెప్పారు. తిరుమల అన్నప్రసాదానికి ప్రవాసాంధ్రులు అరవపల్లి శేషసాయివర్మ, కావ్య, ఆదిత్య, మండవ సత్య పదిటన్నుల కూరగాయలను ఉచితంగా అందించినట్లు తెలిపారు. భక్తులు ఉచితంగా కూరగాయలు ఇస్తే టీటీడీ రవాణా వాహనాన్ని సమకూర్చడంతోపాటు, టోల్గేట్లు, ఆయిల్ ఖర్చులు కూడా భరిస్తుందని చెప్పారు. -
జనవరి నుంచి టిటిడి సత్రాలలో ఉచిత భోజనం
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. భక్తులకు పూర్తిగా సేవలు అందించలేక పోయమని ఆయన బాధపడ్డారు. జనవరి నుంచి టీటీడీ సత్రాల్లో భక్తుల సౌకర్యార్ధం ఉచిత భోజన వసతి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రసాదాల తయారి దిట్టంలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నడకదారి భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ పథకం కొనసాగింపు గురించి పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాపిరాజు చెప్పారు. -
కనుమూరి ఫ్లెక్సీకి చీరకట్టిన సమైక్యవాదులు
ఆకువీడు : సమైక్య రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయకుండా.... మాటలతో సరిపెడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారు. నిలదీసినందుకు తమపై దాడులు చేస్తున్న నేతలకు ...జనం తగిన బుద్ధి చెబుతామంటున్నారు. సీమాంధ్రలో నేతలపై నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న మంత్రి టీజీ వెంకటేష్ ప్రజాగ్రహానికి గురైతే... తాజాగా కాంగ్రెస్ ఎంపీ, టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. సమైక్య ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో సోమవారం లక్ష గళ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చీర కట్టుకున్న ఫోటోతో టీటీడీ చైర్మెన్ కనుమూరి బాపిరాజు ఫ్లెక్సీ కూడా ఇందులో ఉంది. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు .. పదవిని వదలనుంటున్నాడనే క్యాప్షన్ దీనికిచ్చారు. ఈ విషయం తెలిసిన కనుమూరి వర్గానికి చెందిన డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు ఫ్లెక్సీ తొలగించాలని పట్టుబట్టారు. ఉద్యమంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత లేదని సమైక్యవాదులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఫ్లెక్సీ తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ.... ఫ్లెక్సీపై చెప్పులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు... సమైక్యవాదులను నెట్టి కనుమూరి ఫ్లెక్సీని లాక్కెళ్లారు. కాగా మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తు ఉండిపోయారని జేఏసి నేతలు ఆరోపించారు. దాంతో లక్ష గళగర్జన వేదికను తీసివేయాలని పోలీసులు పట్టుబట్టారు. తాము వెనక్కి తగ్గే పరిస్థితి లేదని సమైక్యవాదులు తేల్చి చెప్పారు.