వదలా.. నేనొదలా!
*టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా వెనక్కి తగ్గని బాపిరాజు
*కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యే దాకా.. లేదా పదవీకాలం పూర్తయ్యే వరకూ పదవిని వదలనని స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా చైర్మన్ పదవిని వదిలేది లేదని కనుమూరి బాపిరాజు భీష్మించుకు కూర్చున్నారు. పదవీకాలం పూర్తయ్యే వరకూ గానీ.. కొత్త పాలకవర్గం ఏర్పాటయ్యే దాకా పదవికి రాజీనామా చేయబోనని శుక్రవారం తేల్చి చెప్పారు. పాలకమండళ్లను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడుతాయని అధికారవర్గాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో బాపిరాజు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజుకు ఆగస్టు 24, 2011న అనుహ్యంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది. అధినేత్రి సోనియాగాంధీకి వీరవిధేయుడు కావడంతో రాయపాటి సాంబశివరావును కాదని.. కనూమూరి బాపిరాజునే టీటీడీ చైర్మన్ పదవి వరించింది. ఇంతలోనే రాష్ట్రంలో విభజనోద్యమం తీవ్రరూపం దాల్చింది.
రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఆ పార్టీ నేతలే విమర్శల వర్షం కురిపిస్తోన్న నేపథ్యంలో బాపిరాజు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతూ వచ్చారు. దాంతో టీటీడీ బోర్డు చైర్మన్‌గా పదవీకాలం పూర్తికాక మునుపే ఆగస్టు 25, 2012న మరో రెండేళ్ల పాటు అదే పదవిలో కొనసాగేలా అప్పటి కిరణ్ సర్కారును ఉత్తర్వులు జారీ చేసేలా కాంగ్రెస్ అధిష్ఠానం ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు అప్పటి కిరణ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కనుమూరి బాపిరాజు పదవీకాలం ఆగస్టు 24తో పూర్తి కానుంది.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయాల్సిన కనుమూరి ఆ పనిచేయలేదు. పైగా తన పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగించేలా అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబునే కోరారు. ఆ మేరకు చంద్రబాబుపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా ఒత్తిడి తెచ్చారు. కానీ టీటీడీ సహా రాష్ట్రంలో అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దు చేస్తూ ఈనెల 1న మంత్రివర్గం తీర్మానం చేసింది. ఆమేరకు సోమవారం ఆర్డినెన్స్ జారీ అయ్యే అకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్న కనుమూరి గురువారం తిరుమలకు వచ్చారు. టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసిన నేపథ్యంలో పదవికి రాజీనామా చేయడానికే కనుమూరి తిరుమలకు వచ్చారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ అందరి అంచనాలను తలకిందులు చేశారు. తిరుమలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి తనకు తానుగా రాజీనామా చేయనని సెలవిచ్చారు.
పదవీకాలం పూర్తయ్యే వరకు గానీ.. కొత్త పాలకమండలి ఏర్పాటయ్యే వరకు గానీ పదవిని వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసినా సోమవారం ఆర్డినెన్స్ జారీ కాబోతున్నా కనుమూరి పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. పదవీకాలం పూర్తయ్యే వరకు ఒక్కక్షణం కూడా అధికారాన్ని వదులుకునేది లేదని ఆయన చెప్పకనే చెప్పారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.