కనుమూరి ఫ్లెక్సీకి చీరకట్టిన సమైక్యవాదులు
ఆకువీడు : సమైక్య రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయకుండా.... మాటలతో సరిపెడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారు. నిలదీసినందుకు తమపై దాడులు చేస్తున్న నేతలకు ...జనం తగిన బుద్ధి చెబుతామంటున్నారు. సీమాంధ్రలో నేతలపై నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న మంత్రి టీజీ వెంకటేష్ ప్రజాగ్రహానికి గురైతే... తాజాగా కాంగ్రెస్ ఎంపీ, టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది.
సమైక్య ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో సోమవారం లక్ష గళ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చీర కట్టుకున్న ఫోటోతో టీటీడీ చైర్మెన్ కనుమూరి బాపిరాజు ఫ్లెక్సీ కూడా ఇందులో ఉంది. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు .. పదవిని వదలనుంటున్నాడనే క్యాప్షన్ దీనికిచ్చారు. ఈ విషయం తెలిసిన కనుమూరి వర్గానికి చెందిన డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు ఫ్లెక్సీ తొలగించాలని పట్టుబట్టారు. ఉద్యమంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత లేదని సమైక్యవాదులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఫ్లెక్సీ తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి దిగారు.
దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ.... ఫ్లెక్సీపై చెప్పులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు... సమైక్యవాదులను నెట్టి కనుమూరి ఫ్లెక్సీని లాక్కెళ్లారు. కాగా మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తు ఉండిపోయారని జేఏసి నేతలు ఆరోపించారు. దాంతో లక్ష గళగర్జన వేదికను తీసివేయాలని పోలీసులు పట్టుబట్టారు. తాము వెనక్కి తగ్గే పరిస్థితి లేదని సమైక్యవాదులు తేల్చి చెప్పారు.