akiveedu
-
నిరసన పేరుతో టీడీపీ హైడ్రామా
ఆకివీడు: నిరసన దీక్ష పేరుతో టీడీపీ నేతలు ఆడిన డ్రామా ప్రజలు, మీడియా సాక్షిగా బట్టబయలైంది. వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో రహదారులకు గుంతలు పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా గుంతల్లో పడిపోయి గాయపడ్డారంటూ కట్లు కట్టుకున్న వారిని ఎమ్మెల్యేలు మీడియాకు చూపించారు. యువకుల తలలు, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం ఆయా గుంతల వద్ద వరి నాట్లు వేస్తూ, చేప పిల్లల్ని వదిలి నిరసన వ్యక్తం చేశారు. నిరసన దీక్ష పూర్తయ్యాక గాయపడ్డారని చెబుతున్న యువకులు పక్కకు వెళ్లి కట్లను ఊడదీసుకుని నిరసన ప్రాంతానికి వచ్చారు. గాయాలైన యువకులు సాధారణ వ్యక్తులుగా ప్రత్యక్షమవ్వడంతో అక్కడే ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారు. టీడీపీ నేతల హైడ్రామా సినీ ఫక్కీలో ఉందని ముక్కున వేలేసుకున్నారు. దీక్ష అనంతరం కట్లు ఊడదీసి ఇలా రోడ్డెక్కిన దృశ్యం -
నారా లోకేష్ పర్యటనలో అపశ్రుతి
సాక్షి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. తన పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఆకివీడు మండలం సిద్ధాపురంలో ట్రాక్టర్ నడిపారు. అయితే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి ఉప్పుటేరు కాల్వలోకి ఒరిగింది. దీంతో అప్రమత్తమైన టీడీపీ నేతలు ట్రాక్టర్‌ను అదుపు చేసి లోకేష్‌ను కిందకు దించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
డబ్లింగ్ లైన్‌పై ట్రయల్‌రన్
సాక్షి, పశ్చిమగోదావరి : ఆకివీడు డబ్లింగ్ రైల్వే లైన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం ప్రయోగాత్మకంగా రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాం వద్ద నిర్మించిన డబ్లింగ్ లైన్‌పై నాగర్సోల్–నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌ను నడిపించారు. సుమారు అర కిలోమీటరు మేర ఈ లైన్ నిర్మాణం పూర్తికావడంతో పామర్రు–ఆకివీడు వరకూ డబ్లింగ్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది. జంక్షన్లు, సిగ్నల్స్, క్రాసింగ్ వంటి మైనర్ పనుల్ని పది రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 12 నాటికి డబ్లింగ్ లైన్ పనులు పూర్తి చేస్తారు. ఆగస్టు 15 నుంచి పామర్రు నుంచి ఆకివీడు వరకూ డబుల్ లైన్లో రైళ్ల రాకపోకల్ని ప్రారంభిస్తారు. గత పదిహేను రోజులుగా ఆకివీడులోని ఒకటో ప్లాట్‌ఫాం తొలగించి, ఆ ప్రదేశంలో డబ్లింగ్ లైన్ నిర్మాణ పనుల్ని వేగంగా పూర్తి చేశారు. మొదటి ప్లాట్ ఫాం నిర్మాణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. నర్సాపురం–విజయవాడ, గుడివాడ–మచిలీపట్నం, భీమవరం–నిడదవోలుల మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు కొనసాగుతుండగా, 2022 నాటికి ఆ లైన్లను ప్రారంభించాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. -
ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చి కాటికి పంపించాడు ఓ కొడుకు. పున్నామ నరకాన్ని ఇంట్లోనే చూపించి వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కర్కశంగా మెడపై కాలితో నులిమి, రోడ్డు పైకి ఈడ్చుకువచ్చి పారతో తలను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని చినకాపవరం గ్రామంలో నివసిస్తున్న ఎస్.సత్యవతి(70) తన కుమారుడు బంగారయ్య వద్దే ఉంటోంది. సత్యవతికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. ఇటీవల అరెకరం భూమి, ఇల్లు తన పేరున రాయాలని బంగారయ్య సత్యవతిని ఒత్తిడి చేస్తున్నాడు. ఆస్తి అందరికీ పంచుతానని సత్యవతి చెప్పడంతో ఆమెను చంపేస్తే మొత్తం ఆస్తి తనకే వస్తుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భీమవరం రూరల్ సీఐ శ్యామ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో పడుకుని ఉన్న సత్యవతిని బయటకు తీసుకువచ్చి పారతో తలపై బలంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందన్నారు. మృతురాలి పెద్ద కుమార్తె వానపల్లి నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
'ఆగస్టు 15 నుంచి ట్రయల్ రన్'
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : బ్రాంచ్ రైల్వే లైన్లో డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి ట్రాక్‌పై ట్రయల్ రన్ నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం పి.శ్రీనివాస్ చెప్పారు. మోటూరు నుంచి ఆకివీడు వరకూ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకివీడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూలై 15 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా డబ్లింగ్, విద్యుద్ధీకరణ, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకూ ఆకివీడు స్టేషన్ పరిధిలో కొన్ని లైన్ల లింకులను కలుపుతామన్నారు. దీంతో మోటూరు–ఆకివీడు మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కొత్తలైన్‌పై ప్రయోగాత్మకంగా గూడ్స్ రైళ్ళను నడుపుతామని చెప్పారు. బ్రాంచి రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల అభివృద్ధికి ఆర్వీఎన్ఎల్ సంస్థ నిధులు విడుదల చేస్తుందన్నారు. గత బడ్జెట్లోనే ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కేటాయించిందని వెల్లడించారు. 2022కు బ్రాంచ్ లైన్ల డబ్లింగ్ పూర్తి 2022 నాటికి విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని పూర్తి చేస్తామని డీఆర్ఎం చెప్పారు. ఈ ప్రాంతంలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదనపు లైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్లు తదితర వాటిని నిర్మిస్తామన్నారు. డ్రెయిన్ నిర్మాణానికి ఆదేశం ఆకివీడులో రైల్వే కొలిమిలలో ముంపు నివారణకు పక్కా డ్రెయిన్లు నిర్మించాలని సంబంధిత ఏఈని డీఆర్ఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా కొలిమిలున్నాయని, వర్షం నీటితో ఇవి ముంపునకు గురై దోమలు, ఈగలు, పందుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు డీఆర్ఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన స్పందించి వర్షం ముంపు నీటిని బయటకు మళ్లించేందుకు పక్కా డ్రెయిన్ నిర్మించాలని సూచించారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీఓఎం వి.ఆంజనేయులు, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్లానింగ్ మేనేజర్ మున్నా కుమార్, వరుణ్ బాబు, స్టేషన్ మాస్టర్ వి.మాణిక్యం ఉన్నారు. -
ఆకివీడు టు ఇటలీ
మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సాన పెడితేనే మెరుస్తాయి. వాటి విలువ పెరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారు. అటువంటి వారిని వెతికి వారిలోని నైపుణ్యాన్ని మెరుగు పెట్టేందుకు సాధన చేయించాలి. తర్ఫీదు ఇస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులవుతారనడానికి ఆకివీడు మండలం, దుంపగడప గ్రామానికి చెందిన క్రీడాకారుడు కట్టా గాంధీ నిదర్శనం. –ఆకివీడు పల్లెటూరులో పుట్టినా క్రీడలపై ఆసక్తిని పెంచుకుని, పట్టుదలతో ఫుట్సాల్ క్రీడాకారుడుగా ఎదిగాడు గాంధీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫుట్సాల్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు స్కూల్ స్థాయి నుంచే బంతాటలో మొనగాడనిపించుకున్నాడు. నాటి బంతాటనే ఫుట్సాల్ ఆటగా మార్చుకుని గాంధీ రాణిస్తున్నాడు. ఆకివీడులోని పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఫుట్సాల్పై ఆసక్తిని మరింత పెంపొందించుకున్నాడు. పాఠశాల పీఈటీ రత్నబాబు ప్రోత్సాహంతో మండల, జిల్లా, స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు. ఆసియా ఫుట్సాల్ చాంపియన్ షిప్ పోటీలకు వెళ్లిన జట్టులో కట్టా గాంధీ వివిధ పోటీల్లో గాంధీ స్థానిక ప్రయివేటు విద్యా సంస్థలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూనే 2018 మే నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఫుట్సాల్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఆ తరువాత టీఏఎఫ్ఐఎస్ఏ నిర్వహించిన నైపుణ్య క్రీడాకారుల ఎంపికలో పాల్గొని గాంధీ తన ప్రతిభ కనబర్చాడు. అదే ఏడాది డిసెంబర్ 13 నుంచి 16 వరకూ పాకిస్తాన్లో ఏర్పాటు చేసిన ఆసియా ఫుట్సాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు గాంధీ వెళ్లాడు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీల్లో పాల్గొనకుండానే తిరుగు ముఖం పట్టాడు. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. ఈ నెల 23 నుంచి ఇటలీలో... ఈ నెల 23 నుంచి 29 వరకూ ఇటలీలో నిర్వహించే మౌంటిసెల్వినో ఫుట్సాల్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. రాష్ట్ర జట్టు తరఫున ఇటలీలో జరిగే పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తామన్న ధీమాను గాంధీ వ్యక్తంచేశాడు. ఐపీఎస్ లక్ష్యం క్రీడా పోటీలతో పాటు విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తూ ఐపీఎస్ అవ్వాలన్నదే తన లక్ష్యమని గాంధీ చెప్పారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ స్నేహితులు, అధ్యాపకులు, స్థానికుల సహకారంతో తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. -
బాబోయ్.. కొంపకొల్లేరు
సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక చర్యలేమీ లేవని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి మంతెన వెంకట సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లేరుపై పలు అధ్యయన కమిటీలు వేసినా.. నివేదికలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కాంటూర్ కుదింపు సాధ్యం కాదని, ఇలాంటి హామీలతో టీడీపీ ప్రజలను మభ్యపెడుతోందని, కొల్లేరు సమస్యకు ఇది పరిష్కారం కాదని స్పష్టం చేశారు. 5వ కాంటూర్ వరకూ కొల్లేరును అభివృద్ధి చేయాల్సిందేనని, కొల్లేరు జాతీయ సరస్సుగా గుర్తింపు పొందినప్పుడే దీనికి ప్రాముఖ్యం పెరుగుతుందని, ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలని స్పష్టం చేశారు. సాక్షి : కొల్లేరు సరస్సుకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సు పరీవాహక ప్రాంతంలో చేపల చెరువులు భారీగా తవ్వడం వల్ల సరస్సు కుచించుకుపోయింది. 1971లో ఇరాన్‌లోని రామ్సర్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రపంచ దేశాలు తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం సంతకం చేసింది. దానిలో కొల్లేరు సరస్సు పరిరక్షణ కూడా ఉంది. సాక్షి : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రాలేమా? సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందం నుంచి బయటకు రావడం సాధ్యం కాదు. వస్తే ప్రపంచ దేశాలు వెలివేస్తాయి. మంచినీటి సరస్సును రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సులను పరిరక్షించేందుకు రామ్సర్ ఒప్పందం జరిగింది. సాక్షి : కొల్లేరుపై జీఓ 120 ఎందుకు విడుదల చేశారు. సూర్యనారాయణరాజు : రామ్సర్ ఒప్పందాన్ని అమలు జరిపేందుకే కొల్లేరును అభయారణ్యం చట్ట పరిధిలోకి తీసుకువచ్చేందుకు 120 జీఓను విడుదల చేశారు. జీఓను అప్పటి టీడీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. జీఓను అమలు జరిపితే కొల్లేరు సరస్సు పరిరక్షణ సాధ్యమవుతుంది. సాక్షి : అభయారణ్యం పరిధిలో కొల్లేరు సమస్య ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సును 5వ కాంటూర్ వరకూ గుర్తించి ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా పరిగణించారు. అభయారణ్యం పరిధిలో 72 వేల ఎకరాల భూమి ఉంది. దీనిలో ప్రైవేటు వ్యక్తుల భూమి(జిరాయితీ) 14 వేల ఎకరాలు ఉంది. ప్రైవేటు వ్యక్తుల భూమి ఉన్నప్పుడు అభయారణ్యంగా గుర్తించకూడదు. సాక్షి : కొల్లేరు జిరాయితీ రైతుల పరిస్థితి ఏమిటి? సూర్యనారాయణరాజు : కొల్లేరులోని జిరాయితీ రైతులకు నష్టపరిహారం కేంద్రమే ఇవ్వాల్సి ఉంది. కేంద్ర పరిధిలో ఉన్న ఈ భూములకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. పోలవరం నిర్వాసితులకు చెల్లించినట్టే జిరాయితీ రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది. సుమారు రూ.4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా రూ.1,000 కోట్లు చెల్లించినా సరిపోయేది. కానీ సర్కారు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా కొల్లేరు భూస్వాములు అయినా.. తినడానికి తిండిలేక, పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని దుస్థితిలో ఉన్నారు. జిరాయితీని ఎటూ తేల్చలేకపోవడం దారుణం. సాక్షి : కొల్లేరుపై వేసిన కమిటీల నివేదికలపై చర్యలు తీసుకున్నారా? సూర్యనారాయణరాజు : కొల్లేరుపై పదికిపైగా కమిటీలు వేశారు. కొల్లేరు పరిరక్షణకు చర్యలు ఎలా తీసుకోవాలనే దానిపై నిపుణుల కమిటీని కూడా వేశారు. కమిటీల నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. అజీజ్ కమిటీ నివేదిక అమలుచేస్తే కొల్లేరు సరస్సుకు, జిరాయితీ రైతులకు మేలు జరుగుతుంది. సాక్షి : కొల్లేరును రక్షించాలంటే ఇంకేమి చేయాలి? సూర్యనారాయణరాజు : కొల్లేరును రక్షించాలంటే ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. రెండు మూడు రెగ్యులేటర్ల నిర్మాణం వల్ల ఉపయోగం లేదు. సముద్రపు ఆటుపోట్లు ఉప్పుటేరు ద్వారా ప్రవహించాల్సి ఉంది. ఆ విధంగా జరిగినప్పుడే ఉప్పుటేరు, కొల్లేరు సంరక్షణ సాధ్యం సాక్షి : సరస్సు కాలుష్యాన్ని అరికట్టలేమా? సూర్యనారాయణరాజు : సరస్సు కలుషితం కాకుండా ఉండేందుకు ఇంజినీర్ రామకృష్ణంరాజు సూచనలు పాటిస్తే బాగుంటుంది. కొల్లేరు చుట్టూ డ్రెయిన్లు తవ్వి, ఆ నీరు ఉప్పుటేరులోకి చొచ్చుకుపోయేలా తప్పక చర్యలు తీసుకోవాలి. సాక్షి : ఇంకిపోతున్న కొల్లేరుకు పరిష్కారం? సూర్యనారాయణరాజు : కొల్లేరు సరస్సులోకి కృష్ణా, గోదావరి నదుల నీరు వివిధ కాలువల ద్వారా చొచ్చుకువస్తుంది. పట్టిసం ఎత్తిపోతల పథకంతో కొల్లేరులోకి నీటిప్రవేశం తగ్గిపోయింది. కొల్లేరులోకి చొచ్చుకువచ్చే రామిలేరు, తమ్మిలేరు, బుడమేరు తదితర పంట కాలువల ఇన్‌ఫ్లోలను అభివృద్ధిచేయాలి. సాక్షి : రెగ్యులేటర్ల నిర్మాణ ఆవశ్యకత ఎంత? సూర్యనారాయణరాజు : కొల్లేరులో 5వ కాంటూర్ వరకూ నీరు నిలబడినప్పుడే సరస్సు ఉనికి ఉంటుంది. అందుకోసం ఆకివీడులోని రైల్వే వంతెన సమీపంలో జువ్వ కనుమ వద్ద రెగ్యులేటర్ నిర్మించాలి. దీనిద్వారా కొల్లేరులో నీటి మట్టం పెరిగి సరస్సులోకి పక్షుల రాకపోకలు పెరుగుతాయి. సాక్షి : కొల్లేరు పరిరక్షణకు శాశ్వత మార్గం? సూర్యనారాయణరాజు : కాంటూర్ కుదింపు కొల్లేరు పరిరక్షణకు సరైన పరిష్కారం కానేకాదు. 5వ కాంటూర్ పరిధిలోని జిరాయితీ భూములకు నష్టపరిహారం ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుని ఆసియా ఖండంలోనే విశిష్టమైన మంచినీటి సరస్సును కాపాడుకోవాలి. -
ఖరీఫ్ లక్ష్యం 5.50 లక్షల ఎకరాలు
ఆకివీడు: రాబోయే ఖరీఫ్‌లో జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరిసాగు లక్ష్యమని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు వై.సాయిలక్ష్మీశ్వరి తెలిపారు. ఆకివీడులోని సమతానగర్ రోడ్డులో రైతు జూపూడి శ్రీనివాస్‌కు చెందిన పంట భూమిలో మంగళవారం దాళ్వా దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు 38.50 బస్తాలు దిగుబడి వచ్చింది. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు వేసవిలోనే మెట్ట దుక్కులు చేపట్టాలని సూచించారు. జూన్ మొదటి వారంలో నారుమళ్లు పోసుకుని జూలై మొదటి వారానికి నాట్లు పూర్తిచేయాలన్నారు. సకాలంలో నాట్లు వేయడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని చెప్పారు. మెట్టలో మొలకెత్తని అపరాల విత్తనాలు జిల్లాలో 12 వేల క్వింటాళ్ల అçపరాల విత్తనాలు పంపిణీ చేయగా మెట్ట ప్రాంతంలో నాటిన విత్తనాలు మొలకెత్తలేదని చెప్పారు. అక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉండటమే కారణమన్నారు. డెల్టాలో మూడో పంట ఆశాజనకంగా ఉందన్నారు. 9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు జిల్లాలో వచ్చే ఖరీఫ్‌లో 9 వేల ఎకరాల్లో ప్రకృతి సాగుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. 4 వేల ఎకరాల్లో వరి, మిగిలినది వాణిజ్య పంటల సాగు ఉంటుందన్నారు. గతేడాది 3 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేశామన్నారు. గోమూత్రం, మలంతో తయారు చేసిన ఎరువుల్ని ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. దీనికి అవసరమైన ఆవులను రైతులు పెంచుకునేందుకు సబ్సిడీపై కొనుగోలు చేస్తామన్నారు. జీవ ఎరువుల సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వంగడాల మినీకిట్లు సిద్ధం ఖరీఫ్‌లో సాగుచేసేందుకు కొత్త వంగడాల మినీ కిట్లు సిద్ధం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. స్వర్ణకు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1229, సాంబ మసూరీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎంటీయూ 1224, 1010కి ప్రత్యామ్నాయంగా 1224 వంగడాన్ని రైతులు సాగు చేయాలని సూచించారు. యంత్రం.. రైతు ఇష్టం వ్యవసాయ పనిముట్లను రైతుల ఇష్టానుసారం కొనుగోలు చేసుకోవచ్చని ఆమె చెప్పారు. రైతుకు నచ్చిన కంపెనీ యంత్రాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. 20 శాతం సబ్సిడీ, 30 శాతం రైతు పెట్టుబడి, 50 శాతం రుణం బ్యాంకులు అందజేస్తాయన్నారు. వ్యవసాయాధికారి నిమ్మల శ్రీనివాస్, గంణాంకాధికారి గంగయ్య, వీఆర్ఓ చైతన్య, ఎంపీఈఓలు ఆమె వెంట ఉన్నారు. -
హాలీవుడ్ స్థాయిలో తెలుగు సినిమా
ఆకివీడు : తెలుగు చిత్ర పరిశ్రమ హాలివుడ్ స్థాయికి ఎదిగిందని సినీ, బుల్లితెర నటుడు వి.సాయికిరణ్ అన్నారు. సరిగమ సంగీత పురస్కారాన్ని అందుకునేందుకు ఆకివీడు వచ్చిన ఆయన వైఎస్సార్ సీపీ నాయకుడు అట్లూరి రంగారావు నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక రంగంలో తెలుగు సినిమాలు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచస్థాయిలో వెలుగొందుతున్నాయని అన్నారు. నువ్వే కావాలి, ప్రేమించు చిత్రాలు, వెంగమాంబ వంటి సీరియళ్లు తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. ప్రస్తుతం టీవీ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నానన్నారు. నక్షత్రం, ఏసుక్రీస్తుపై తీస్తున్న తొలికిరణం సినిమాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. టీవీ సీరియల్స్‌లో నటించడమే మనస్సుకు తృప్తిగా ఉందన్నారు. పౌరాణికంలో శివుడు పాత్ర పోషించాలని కోరిక ఉందని చెప్పారు. ఇప్పటి వరకూ 30కి పైగా సినిమాల్లో నటించానన్నారు. సమావేశంలో అట్లూరి రంగారావు, మహ్మద్ మదనీ, బొబ్బిలి బంగారయ్య, కందుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
యోగా వల్ల ఆసుపత్రులు ఖాళీ కావాలి
ఆకివీడు : ఆసుపత్రులు ఖాళీ అయితేనే యోగా విజయవంతమైనట్టని రాష్ట్ర యోగా, స్పోర్ట్సు అధికారి పేరం రవీంద్రనాథ్ అన్నారు. గ్రామంలోని జిల్లా పతంజలి యోగారోగ్య కేంద్రంలో ఆదివారం జిల్లాస్థాయి యోగా పోటీలు నిర్వహించారు. పతంజలి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో 8 సంవత్సరాల చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకూ పాల్గొని యోగాసనాలతో అబ్బుర పరిచారు. రాత్రి నిర్వహించిన ముగింపు సభలో రవీంద్ర మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో యోగాను ప్రవేశ పెట్టి ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల పాఠశాలల్లో 14 వేల మంది ఉపాధ్యాయులకు యోగ శిక్షణ ఇప్పించామన్నారు. ఇకపై రోజూ యోగా, స్పోర్ట్సును రెండు పిరియడ్లుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పతంజలి యోగారోగ్య కేంద్రం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీబీ ప్రతాప్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిని యోగా కేంద్రంగా మార్చే సత్తా ప్రజల్లో ఉందన్నారు. యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వబలిశెట్టి శ్రీవెంకేటశ్వరరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 142 మంది పాల్గొన్నారని చెప్పారు. అనంతరం అంతర్జాతీయ, జాతీయస్థాయి యోగా చాంపియన్లను ఘనంగా సత్కరించారు. క్రీడాకారులందరికీ భోజన వసతిని రైస్ మిల్లర్, యోగా కేంద్రం ప్రతినిధి నేరెళ్ల రామ చెంచయ్య ఏర్పాటు చేశారు. పతంజలి కేంద్రం ప్రతినిధులు ఉండ్రమట్ల సాంబశివరావు, నేరెళ్ల రామ రోశయ్య, కుంకట్ల సత్యనారాయణ, యోగా సాంబశివరావు, వాణీశ్రీ, వెంకటేశ్వరరావు, భూపతిరాజు సత్యనారాయణరాజు, టి.రోషిణి, సీతారామయ్య, కె.సత్యనారాయణ, కేవీకే గాంధీ, కె.రమణారెడ్డి, వి.మోహన్, జి.సుబ్రహ్మణ్యంరాజు పాల్గొన్నారు. -
కనుమూరి ఫ్లెక్సీకి చీరకట్టిన సమైక్యవాదులు
ఆకువీడు : సమైక్య రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేయకుండా.... మాటలతో సరిపెడుతున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై కొందరు కాంగ్రెస్ నేతలు దాడులకు దిగుతున్నారు. నిలదీసినందుకు తమపై దాడులు చేస్తున్న నేతలకు ...జనం తగిన బుద్ధి చెబుతామంటున్నారు. సీమాంధ్రలో నేతలపై నిరసనల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న మంత్రి టీజీ వెంకటేష్ ప్రజాగ్రహానికి గురైతే... తాజాగా కాంగ్రెస్ ఎంపీ, టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజుకు కూడా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. సమైక్య ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో నాన్ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో సోమవారం లక్ష గళ గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చీర కట్టుకున్న ఫోటోతో టీటీడీ చైర్మెన్ కనుమూరి బాపిరాజు ఫ్లెక్సీ కూడా ఇందులో ఉంది. చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు .. పదవిని వదలనుంటున్నాడనే క్యాప్షన్ దీనికిచ్చారు. ఈ విషయం తెలిసిన కనుమూరి వర్గానికి చెందిన డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు ఫ్లెక్సీ తొలగించాలని పట్టుబట్టారు. ఉద్యమంలో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశామే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత లేదని సమైక్యవాదులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఫ్లెక్సీ తొలగించాల్సిందేనని కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేస్తూ.... ఫ్లెక్సీపై చెప్పులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు... సమైక్యవాదులను నెట్టి కనుమూరి ఫ్లెక్సీని లాక్కెళ్లారు. కాగా మొత్తం వ్యవహారంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తు ఉండిపోయారని జేఏసి నేతలు ఆరోపించారు. దాంతో లక్ష గళగర్జన వేదికను తీసివేయాలని పోలీసులు పట్టుబట్టారు. తాము వెనక్కి తగ్గే పరిస్థితి లేదని సమైక్యవాదులు తేల్చి చెప్పారు.