
రక్తం కారుతూ గాయాలైనట్టు కట్లు కట్టుకున్న యువకులు
ఆకివీడు: నిరసన దీక్ష పేరుతో టీడీపీ నేతలు ఆడిన డ్రామా ప్రజలు, మీడియా సాక్షిగా బట్టబయలైంది. వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో రహదారులకు గుంతలు పడ్డా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుల ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ముగ్గురు యువకులు మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా గుంతల్లో పడిపోయి గాయపడ్డారంటూ కట్లు కట్టుకున్న వారిని ఎమ్మెల్యేలు మీడియాకు చూపించారు. యువకుల తలలు, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. అనంతరం ఆయా గుంతల వద్ద వరి నాట్లు వేస్తూ, చేప పిల్లల్ని వదిలి నిరసన వ్యక్తం చేశారు. నిరసన దీక్ష పూర్తయ్యాక గాయపడ్డారని చెబుతున్న యువకులు పక్కకు వెళ్లి కట్లను ఊడదీసుకుని నిరసన ప్రాంతానికి వచ్చారు. గాయాలైన యువకులు సాధారణ వ్యక్తులుగా ప్రత్యక్షమవ్వడంతో అక్కడే ఉన్న ప్రజలు, మీడియా ప్రతినిధులు నివ్వెరపోయారు. టీడీపీ నేతల హైడ్రామా సినీ ఫక్కీలో ఉందని ముక్కున వేలేసుకున్నారు.
దీక్ష అనంతరం కట్లు ఊడదీసి ఇలా రోడ్డెక్కిన దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment