ఫుట్‌సాల్ ఆడుతున్న గాంధీ ,కప్పుతో కట్టా గాంధీ
మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్నాయి. వాటికి సాన పెడితేనే మెరుస్తాయి. వాటి విలువ పెరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులున్నారు. అటువంటి వారిని వెతికి వారిలోని నైపుణ్యాన్ని మెరుగు పెట్టేందుకు సాధన చేయించాలి. తర్ఫీదు ఇస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులవుతారనడానికి ఆకివీడు మండలం, దుంపగడప గ్రామానికి చెందిన క్రీడాకారుడు కట్టా గాంధీ నిదర్శనం. –ఆకివీడు
పల్లెటూరులో పుట్టినా క్రీడలపై ఆసక్తిని పెంచుకుని, పట్టుదలతో ఫుట్‌సాల్ క్రీడాకారుడుగా ఎదిగాడు గాంధీ. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫుట్‌సాల్ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు స్కూల్ స్థాయి నుంచే బంతాటలో మొనగాడనిపించుకున్నాడు. నాటి బంతాటనే ఫుట్‌సాల్ ఆటగా మార్చుకుని గాంధీ రాణిస్తున్నాడు. ఆకివీడులోని పులవర్తి లక్ష్మణస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ ఫుట్‌సాల్‌పై ఆసక్తిని మరింత పెంపొందించుకున్నాడు. పాఠశాల పీఈటీ రత్నబాబు ప్రోత్సాహంతో మండల, జిల్లా, స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించాడు.
ఆసియా ఫుట్‌సాల్ చాంపియన్ షిప్ పోటీలకు వెళ్లిన జట్టులో కట్టా గాంధీ
వివిధ పోటీల్లో గాంధీ
స్థానిక ప్రయివేటు విద్యా సంస్థలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతూనే 2018 మే నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఫుట్‌సాల్ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటాడు. ఆ తరువాత టీఏఎఫ్‌ఐఎస్‌ఏ నిర్వహించిన నైపుణ్య క్రీడాకారుల ఎంపికలో పాల్గొని గాంధీ తన ప్రతిభ కనబర్చాడు. అదే ఏడాది డిసెంబర్ 13 నుంచి 16 వరకూ పాకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ఆసియా ఫుట్‌సాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు గాంధీ వెళ్లాడు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీల్లో పాల్గొనకుండానే తిరుగు ముఖం పట్టాడు. 2019లో గోవాలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొని మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు.
ఈ నెల 23 నుంచి ఇటలీలో...
ఈ నెల 23 నుంచి 29 వరకూ ఇటలీలో నిర్వహించే మౌంటిసెల్వినో ఫుట్‌సాల్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికయ్యాడు. రాష్ట్ర జట్టు తరఫున ఇటలీలో జరిగే పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తామన్న ధీమాను గాంధీ వ్యక్తంచేశాడు.
ఐపీఎస్ లక్ష్యం
క్రీడా పోటీలతో పాటు విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తూ ఐపీఎస్ అవ్వాలన్నదే తన లక్ష్యమని గాంధీ చెప్పారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ స్నేహితులు, అధ్యాపకులు, స్థానికుల సహకారంతో తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment