![South Central Railway DRM P Srinivas Says,Trail Run Is Set To In Track By August Fifteen - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/11/wg-2.jpg.webp?itok=6INPyIdS)
సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి) : బ్రాంచ్ రైల్వే లైన్‌లో డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని వేగవంతం చేసి, ఆగస్టు 15 నాటికి ట్రాక్‌పై ట్రయల్ రన్ నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం పి.శ్రీనివాస్ చెప్పారు. మోటూరు నుంచి ఆకివీడు వరకూ డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆకివీడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జూలై 15 నుంచి ఆగస్టు 1వ తేదీలోగా డబ్లింగ్, విద్యుద్ధీకరణ, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి పనుల్ని వేగవంతం చేస్తామన్నారు.
ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకూ ఆకివీడు స్టేషన్ పరిధిలో కొన్ని లైన్ల లింకులను కలుపుతామన్నారు. దీంతో మోటూరు–ఆకివీడు మధ్య డబ్లింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. కొత్తలైన్‌పై ప్రయోగాత్మకంగా గూడ్స్ రైళ్ళను నడుపుతామని చెప్పారు. బ్రాంచి రైల్వే లైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ, స్టేషన్ల అభివృద్ధికి ఆర్‌వీఎన్‌ఎల్ సంస్థ నిధులు విడుదల చేస్తుందన్నారు. గత బడ్జెట్‌లోనే ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులు కేటాయించిందని వెల్లడించారు.
2022కు బ్రాంచ్ లైన్ల డబ్లింగ్ పూర్తి
2022 నాటికి విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు బ్రాంచి రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనుల్ని పూర్తి చేస్తామని డీఆర్‌ఎం చెప్పారు. ఈ ప్రాంతంలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అదనపు లైన్ల నిర్మాణం, విద్యుత్ సబ్ స్టేషన్లు తదితర వాటిని నిర్మిస్తామన్నారు.
డ్రెయిన్ నిర్మాణానికి ఆదేశం
ఆకివీడులో రైల్వే కొలిమిలలో ముంపు నివారణకు పక్కా డ్రెయిన్లు నిర్మించాలని సంబంధిత ఏఈని డీఆర్‌ఎం ఆదేశించారు. రైల్వే స్టేషన్‌కు ఇరువైపులా కొలిమిలున్నాయని, వర్షం నీటితో ఇవి ముంపునకు గురై దోమలు, ఈగలు, పందుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన స్పందించి వర్షం ముంపు నీటిని బయటకు మళ్లించేందుకు పక్కా డ్రెయిన్ నిర్మించాలని సూచించారు. డీఆర్‌ఎం వెంట సీనియర్ డీఓఎం వి.ఆంజనేయులు, ఆర్‌వీఎన్‌ఎల్ చీఫ్ ప్లానింగ్ మేనేజర్ మున్నా కుమార్, వరుణ్ బాబు, స్టేషన్ మాస్టర్ వి.మాణిక్యం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment