సంప్రదాయ ఫిష్‌ప్లేట్ జాయింట్ల స్థానంలో వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్ వినియోగం
విజయవాడ–గూడూరు సెక్షన్‌లో వేటపాలెం వద్ద ఏర్పాటు
దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఇదే తొలిసారి
వేటపాలెం/రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మార్గదర్శకంగా నిలుస్తోంది. పెరుగుతున్న రైళ్ల వేగాన్ని, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్‌లను ఆధునీకరిస్తోంది. తాజాగా విజయవాడ డివిజన్‌లోని వేటపాలెం వద్ద వెల్డబుల్ కాస్ట్ మాంగనీస్ స్టీల్(డబ్ల్యూసీఎంసీ) క్రాసింగ్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది.
ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యంత రద్దీగా ఉండే విజయవాడ–గూడూరు సెక్షన్ పరిధిలోని బాపట్ల జిల్లా వేటపాలెం డౌన్‌లైన్‌లో మంగళవారం రైల్వే అధికారులు విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ పరిజ్ఞానాన్ని దక్షిణ మధ్య రైల్వేజోన్ పరిధిలో మొదటి సారిగా ఉపయోగించారు. భారతీయ రైల్వేలో ఇది రెండవది. రైళ్లలో పెరిగిన వేగం, హెవీ యాక్సిల్ లోడ్‌ను అధిగమించేందుకు డబ్ల్యూసీఎంసీ క్రాసింగ్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
రైలు ఒక లైను నుంచి మరో లైను దాటే జంక్షన్‌ల వద్ద ట్రాక్‌లో ఉపయోగించే కీలక భాగమే డబ్యూసీఎంసీ. ఇప్పటి వరకు రెండు బ్లాక్ సెక్షన్ల మధ్య లాంగ్ వెల్డ్ రైల్స్(ఎల్‌డబ్ల్యూఆర్) ఉండేవి. జాయింట్ ఫ్రీ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల యార్డ్‌లలో టర్న్ అవుట్‌ల వెనుక ఫిష్ ప్లేట్ జాయింట్‌తో వేరు చేసేవారు. ఇప్పుడు డబ్యూసీఎంసీ అందుబాటులోకి రావడం వల్ల 130 కి.మీ వేగంతో నడిచే రైళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగదని అధికారులు చెప్పారు.
ప్రయాణికులు సురక్షితంగా, కుదుపులు లేకుండా ప్రయాణించేందుకు ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. డబ్యూసీఎంసీ క్రాసింగ్ ఏర్పాటు విజయవాడ డివిజన్‌లో చారిత్రాక మైలురాయిగా నిలుస్తుందన్నారు. డివిజన్ సీనియర్ డీఈఎన్ వరుణ్‌బాబు, ఇతర అధికారులను ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment